Shiv Sena foundation Day: చీలిక తర్వాత తొలిసారి శివసేన వ్యవస్థాపక దినోత్సవం

ABN , First Publish Date - 2023-06-17T17:47:47+05:30 IST

శివసేన వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 19న పోటాపోటీగా నిర్వహించేందుకు అటు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉద్ధవ్ థాకరే సారథ్యంలో శివసేన యూబీటీ సిద్ధమవుతున్నాయి.

Shiv Sena foundation Day: చీలిక తర్వాత తొలిసారి శివసేన వ్యవస్థాపక దినోత్సవం

ముంబై: శివసేన వ్యవస్థాపక దినోత్సవం (Shiv Sena Foundation Day) ఈనెల 19న పోటాపోటీగా నిర్వహించేందుకు అటు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన (Shiv Sena), ఉద్ధవ్ థాకరే సారథ్యంలో శివసేన (UBT) సిద్ధమవుతున్నాయి. వేర్వేరు వేదికలపై జరుగుతున్న ఈ ఉత్సవాల్లో తమదే నిజమైన శివసేన అని చాటుకునేందుకు ఇరువర్గాలు గట్టి సన్నాహకాలు చేస్తున్నాయి. గత ఏడాది శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం శివసేన వ్యవస్థాపక దినోత్సవం జరగనుండటం ఇదే ప్రథమం.

ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని 'మహా వికాస్ అఘాడి' ప్రభుత్వం గత ఏడాది కుప్పకూలింది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. షిండే చీలిక వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం ఇరువర్గాలు పోటీపడగా, షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గత ఏడాది ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయించింది. ఈ నిర్ణయాన్ని ఉద్ధవ్ శివసేన తప్పుపడుతూ, ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను కోల్పోయిందని ప్రకటించింది. ఈ క్రమంలో చీలక అనంతరం జరుగుతున్న పార్టీ వ్యవస్థాప దినోత్సవాన్ని శివసేన రెండు వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

వేదికలివే..

కాగా, షిండే సారథ్యంలోని శివసేన వాయవ్య ముంబైలోని గోరెగావ్‌లో నెస్కో గ్రౌండ్స్‌లో వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఉద్ధవ్ యూబీటీ తమ ఈవెంటన్‌ను సెంట్రల్ ముంబైలోని సియాన్‌లో ఉన్న షణ్ముఖానంద్ హాలులో నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఏక్‌నాథ్ షిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తెలిపారు. కాగా, శివసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉద్ధవ్ థాకరే తన కుమారుడు ఆదిత్య థాకరే నియోజకవర్గమైన వోర్లిలో పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆ పార్టీ పత్రిక 'సామ్నా' తెలిపింది. 1966లో శివసేన పార్టీని బాల్ థాకరే ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-06-17T18:51:15+05:30 IST