Karnataka Assembly Elections: రెండో జాబితా రెడీ.. శెట్టర్‌కు టికెట్‌పై యెడ్యూరప్ప ఏమన్నారంటే!

ABN , First Publish Date - 2023-04-12T16:55:47+05:30 IST

శెట్టర్‌ను ఢిల్లీ రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు.

Karnataka Assembly Elections: రెండో జాబితా రెడీ.. శెట్టర్‌కు టికెట్‌పై యెడ్యూరప్ప ఏమన్నారంటే!
Karnataka Assembly Elections

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) పోటీచేసే బీజేపీ(BJP) అభ్యర్థుల రెండో జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప(former Karnataka CM, BS Yediyurappa) వెల్లడించారు. అలాగే అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించిన కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌కు (Jagadish Shettar) పార్టీ టికెట్ లభించే అవకాశం ఉందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శెట్టర్‌ను ఢిల్లీ రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. బీజేపీ నిన్న విడుదల చేసిన 189 స్థానాల్లో బీజేపీ 130 స్థానాల్లో తప్పకుండా గెలుస్తుందని యెడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. తామే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

బీజేపీ నిన్న విడుదల చేసిన 189 మంది జాబితాలో సీఎం బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పేర్లు కూడా ఉన్నాయి. 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు. 8 మంది మహిళలకు చోటిచ్చారు. 189 టికెట్లలో 32 ఓబీసీలకు, 30 ఎస్సీలకు, 16 ఎస్టీలకు ఇచ్చారు. వరుణలో సిద్దూతో మంత్రి వి.సోమన్న తలపడనున్నారు. అలాగే కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మరో మంత్రి ఆర్‌.అశోక బరిలోకి దిగనున్నారు. ఇక సీఎం బొమ్మై తన సొంత నియోజకవర్గం శిగ్గావ్‌లో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్‌మగళూర్‌లో, రాష్ట్ర మంత్రి బి.శ్రీరాములు బళ్లారి రూరల్‌లో, గాలి జనార్దనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి బళ్లారి సిటీలో బరిలోకి దిగనున్నారు. హిజాబ్‌ వివాదం తలెత్తిన ఉడుపిలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘుపతి భట్‌ స్థానంలో యశ్‌పాల్‌ సువర్ణకు అవకాశమిచ్చారు.

కాంగ్రెస్ ఇప్పటివరకూ 165 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జేడీఎస్ 97 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-12T16:55:57+05:30 IST