Teesta Setalvad : ఆలస్యం చేయకుండా లొంగిపోండి.. తీస్తా సెతల్వాద్‌కు హైకోర్టు ఆదేశం..

ABN , First Publish Date - 2023-07-01T14:49:46+05:30 IST

యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ (Teesta Setalvad)కు గుజరాత్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలను ఆమె కల్పించి, సృష్టించారని నమోదైన కేసులో ఆమెకు రెగ్యులర్ బెయిలు మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆలస్యం చేయకుండా లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది.

Teesta Setalvad : ఆలస్యం చేయకుండా లొంగిపోండి.. తీస్తా సెతల్వాద్‌కు హైకోర్టు ఆదేశం..
Teesta Setalwad

అహ్మదాబాద్ : యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ (Teesta Setalvad)కు గుజరాత్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలను ఆమె కల్పించి, సృష్టించారని నమోదైన కేసులో ఆమెకు రెగ్యులర్ బెయిలు మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆలస్యం చేయకుండా లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది.

2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, మరికొందరిని ఇరికించేందుకు తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. మోదీ, తదితరులను కేసుల్లో ఇరికించేందుకు ఆమె విస్తృత స్థాయి కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. అహ్మదాబాద్ డిటెన్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును నమోదు చేసింది. ఈ కేసులో ఆమెతోపాటు ఆమె సహ నిందితుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌ను గుజరాత్ పోలీసులు గత ఏడాది జూన్ 25న అరెస్టు చేశారు. ఏడు రోజుల పోలీస్ రిమాండ్ తర్వాత జూలై రెండున జ్యుడిషియల్ కస్టడీకి ఆమెను తరలించారు. అయితే గత ఏడాది సెప్టెంబరులో ఆమెకు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. దీంతో ఆమె జ్యుడిషియల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.

తనకు సాధారణ బెయిలు మంజూరు చేయాలని తీస్తా సెతల్వాద్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు బెయిలు మంజూరు చేయవద్దని గుజరాత్ ప్రభుత్వం హైకోర్టును కోరింది. తప్పుడు సాక్ష్యాలను సృష్టించినట్లు ఆమె ఆరోపణలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ నుంచి ఆమె రూ.30 లక్షలు తీసుకున్నారని తెలిపింది. 2002లో జరిగిన అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే లక్ష్యంతో ఈ సొమ్మును ఆయన ఆమెకు ఇచ్చారని తెలిపింది. గుజరాత్‌ను అపఖ్యాతిపాలు చేయాలనే లక్ష్యంతో ఓ రాజకీయ నేతకు పరికరంగా ఆమె వ్యవహరించారని ఆరోపించింది.

గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, తదితరుల ప్రమేయం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు జకియా పిటిషన్‌ను గత ఏడాది జూన్ 24న తోసిపుచ్చింది. ఆ మర్నాడే తీస్తా సెతల్వాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుజరాత్ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమీన్ వాదనలు వినిపిస్తూ, 2002లో గోద్రా రైలు దుర్ఘటన తర్వాత జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని ప్రచారం చేసేందుకు, అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు తీస్తా సెతల్వాద్, పోలీసు అధికారులు శ్రీకుమార్, సంజీవ్ భట్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఆమెకు బెయిలు మంజూరు చేయరాదని కోరారు.

తీస్తా సెతల్వాద్ బెయిలు దరఖాస్తును గత ఏడాది జూలైలో సెషన్స్ కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. తీస్తాకు గతంలో సన్నిహితంగా వ్యవహరించిన రయీస్ ఖాన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ప్రస్తావించింది. అహ్మదాబాద్ సర్క్యూట్ హౌస్‌లో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, తీస్తా సెతల్వాద్ సమావేశమయ్యారని ఖాన్ ఈ స్టేట్‌మెంట్‌లో చెప్పినట్లు తెలిపింది. కొందరిని కటకటాల వెనుకకు నెట్టే విధంగా చూడాలని సెతల్వాద్‌ను పటేల్ ఆదేశించినట్లు ఖాన్ చెప్పారని వివరించింది. పటేల్ ఆమెకు రూ.30 లక్షలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. తీస్తా మొదట్లో మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా తండ్రి విఠల్ భాయ్ పాండ్యాను సంప్రదించారని, అల్లర్లతో సంబంధం లేనివారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయబోనని ఆయన చెప్పడంతో, ఆమె జకియా జాఫ్రిపై దృష్టి పెట్టారని తెలిపింది.

జస్టిస్ నిర్జర్ దేశాయ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్తూ, తీస్తా సెతల్వాద్ బెయిలు దరఖాస్తును డిస్మిస్ చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది.

అయితే ఈ తీర్పును 30 రోజులపాటు నిలిపివేయాలని సీనియర్ న్యాయవాది మిహిర్ ఠాకూర్ హైకోర్టును కోరారు.

ఇవి కూడా చదవండి :

Maharashtra : మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి..

Jaishankar and Shashi Tharoor : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై శశి థరూర్ వ్యాఖ్యలు

Updated Date - 2023-07-01T14:49:46+05:30 IST