Aero India 2023 : హనుమంతుడి స్టిక్కర్ పెట్టినట్లు పెట్టి తీసేసిన హెచ్ఏఎల్

ABN , First Publish Date - 2023-02-14T15:47:06+05:30 IST

ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్ షో 14వ ఎడిషన్ బెంగళూరు సమీపంలోని యెలహంక వైమానిక స్థావరంలో జరుగుతోంది.

Aero India 2023 : హనుమంతుడి స్టిక్కర్ పెట్టినట్లు పెట్టి తీసేసిన హెచ్ఏఎల్
Lord Hanuman Image

బెంగళూరు : కర్ణాటకలోని యెలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న ఏరో ఇండియా 2023 ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో ఓ విమానానికి ఆంజనేయ స్వామి బొమ్మతో కూడిన స్టిక్కర్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అంటించింది. వివాదం తలెత్తడంతో మంగళవారం ఆ స్టిక్కర్‌ను తొలగించింది. అంతర్గతంగా చర్చించుకుని దీనిని తొలగించామని హెచ్ఏఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డీకే సింగ్ చెప్పారు.

ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్ షో 14వ ఎడిషన్ బెంగళూరు సమీపంలోని యెలహంక వైమానిక స్థావరంలో జరుగుతోంది. అత్యాధునిక టెక్నాలజీలు, ఉత్పత్తులు, ఏరోస్పేస్‌లో సర్వీసులు, డిఫెన్స్ ఇండస్ట్రీస్ వంటివన్నీ దీనిలో ఉంటాయి. ప్రపంచంలోని నలుమూలల ఉన్న ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, మిలిటరీ రిప్రజెంటేటివ్స్ దీనిలో పాల్గొంటున్నారు. మన దేశంలోని ప్రముఖ రక్షణ రంగ, వైమానిక కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సూపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్ HLFT-42 (Hindustan Lead Fighter Trainer)ను ప్రదర్శించింది. దీని తోకపైన ఆంజనేయ స్వామి బొమ్మతో కూడిన స్టిక్కర్‌ను అంటించింది. దీని క్రింద ‘తుపాను వస్తోంది’ (Storm is coming) అనే సందేశాన్ని కూడా పెట్టింది. దీనిపై చాలా మంది సానుకూలంగా స్పందించినప్పటికీ, కొందరు విమర్శించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ స్టిక్కర్‌ను మంగళవారం తొలగించారు.

హెచ్ఏఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డీకే సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విమానం సత్తాను తెలిపేందుకు హనుమంతుడి బొమ్మతో కూడిన స్టిక్కర్‌ను అంటించామని తెలిపారు. అయితే ఆ తర్వాత అంతర్గతంగా చర్చించుకుని, దానిని ఉంచకూడదని నిర్ణయించుకున్నామని, అందుకే తొలగించామని చెప్పారు. ఇది చాలా చిన్న విషయమన్నారు. ఇంతకు ముందు ఉన్న ట్రైనర్ విమానం ‘మారుత్’ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై కొన్ని వ్యాఖ్యానాలను తాము గమనించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నందువల్ల, కేవలం ప్రాజెక్టుపైన మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నామన్నారు.

హెచ్ఎల్ఎఫ్‌టీ-42 విశిష్టతలు

ఈ విమానం లైట్‌వెయిట్ మల్టీరోల్ ఫైటర్ విమానం. దీనిని హెచ్ఏఎల్ అభివృద్ధి చేసింది. హెచ్ఏఎల్ తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ స్ఫూర్తితో దీనిని రూపొందించింది. భారత వైమానిక దళం, భారత నావికా దళం అవసరాలను తీర్చేందుకు దీనిని అభివృద్ధి చేసింది. దీనిలో అడ్వాన్స్‌డ్ ఏవియానిక్స్, ఆయుధాల వ్యవస్థలు ఉన్నాయి. గగనతలం నుంచి గగనతలానికి, గగనతలం నుంచి భూమిపైకి కార్యకలాపాలను నిర్వహించగలదు.

భారత వాయు సేన (IAF) పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా HLFT-42ను తీర్చిదిద్దారు. విన్యాసాలు చేయడానికి చాలా అనువైన రీతిలో దీనిని రూపొందించారు. మన దేశ రక్షణ దళాలకు ఇది గొప్ప సంపదగా నిలుస్తుందని భావిస్తున్నారు. గగనతల రక్షణ, గగనతల ఆధిపత్యం, దాడుల నిర్వహణలకు ఇది ఉపయోగపడుతుంది. అయితే దీనికి పేరును ఇంకా ఖరారు చేయలేదు.

ఏరో ఇండియా 2023ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం ప్రారంభించారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో పెట్టుబడులకు భారత దేశం ఆకర్షణీయ గమ్యస్థానమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ హార్డ్‌వేర్‌ ప్రధాన ఎగుమతిదారుల్లో ఒకటిగా భారత్ దూసుకెళ్తోందన్నారు.

Updated Date - 2023-02-14T15:47:11+05:30 IST