Wrestlers : గంగా నదిలో పతకాలను కలిపే స్వేచ్ఛ రెజ్లర్లకు ఉంది, వారిని అడ్డుకోం : హరిద్వార్ పోలీసులు
ABN , First Publish Date - 2023-05-30T16:42:35+05:30 IST
భారత దేశ టాప్ రెజ్లర్లు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ, తాము గెలిచిన పతకాలను గంగా నదిలో కలుపుతామని ప్రకటించారు.
హరిద్వార్ (ఉత్తర ప్రదేశ్) : భారత దేశ టాప్ రెజ్లర్లు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ, తాము గెలిచిన పతకాలను గంగా నదిలో కలుపుతామని ప్రకటించారు. వీరిని తాము అడ్డుకోబోమని హరిద్వార్ పోలీసులు స్పష్టం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను తక్షణం అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీరు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, రెజ్లర్లు మంగళవారం సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తారని చెప్పారు. ఈ పతకాలు తమ ప్రాణమని, తమ ఆత్మ అని చెప్పారు. వీటిని గంగా నదిలోకి విసిరేసిన తర్వాత జీవించి ఉండటంలో అర్థం లేదన్నారు. వీటిని గంగా నదిలో కలిపేసిన తర్వాత తాము ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో హరిద్వార్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ మాట్లాడుతూ, రెజ్లర్లు తమకు నచ్చిన పని చేయవచ్చునని తెలిపారు. పవిత్రమైన గంగా నదిలో వారు తమ పతకాలను నిమజ్జనం చేసేందుకు వస్తే, తాము వారిని ఆపబోమని తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి తనకు ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు. భక్తులు బంగారం, వెండి, విబూది వంటివాటిని పవిత్రమైన గంగా నదిలో కలుపుతారని, రెజ్లర్లు తమ పతకాలను నిమజ్జనం చేయవచ్చునని తెలిపారు. గంగా పుష్కరాలు, దసరా వంటి పర్వ దినాల్లో 15 లక్షల మంది వరకు భక్తులు వస్తూ ఉంటారని, రెజ్లర్లకు కూడా స్వాగతమని చెప్పారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) ఓ మైనర్‌తో సహా కొందరు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. వీరు ఏప్రిల్ 23 నుంచి నిరసన తెలుపుతున్నారు. రెజ్లర్లు ఆదివారం నూతన పార్లమెంటు భవనంవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. వినేష్ ఫోగట్, బజ్రంగ్ పూనియా, సంగీత ఫోగట్, సాక్షి మాలిక్, తదితరులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
Moscow : రష్యా రాజధానిపై డ్రోన్ల దాడి
Delhi excise policy scam : మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు