Pakistan : ఇమ్రాన్ ఖాన్ మరో నాలుగైదు రోజులు కస్టడీలోనే.. హింసాత్మక నిరసనలతో అల్లకల్లోలం..
ABN , First Publish Date - 2023-05-10T13:42:56+05:30 IST
అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరో నాలుగు లేదా ఐదు రోజులపాటు కస్టడీలోనే
ఇస్లామాబాద్ : అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరో నాలుగు లేదా ఐదు రోజులపాటు కస్టడీలోనే గడపవలసి రావచ్చు. ఆయనను కట్టుదిట్టమైన భద్రత నడుమ బుధవారం అకౌంటబిలిటీ కోర్టులో హాజరుపరుస్తారు. మరోవైపు ఆయనను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాదులకు అనుమతి లభించలేదు. దీనిపై పీటీఐ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాన్ ప్రాథమిక హక్కులను ప్రభుత్వం నిరాకరిస్తోందని దుయ్యబట్టింది. నేడు పాకిస్థాన్‌లో జరుగుతున్నదానిపై తీవ్ర అసహనం ప్రదర్శించింది. ‘‘పాకిస్థాన్ ప్రజలారా, మీరు మాత్రమే దేశాన్ని కాపాడగలరు’’ అని స్పష్టం చేసింది.
పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ఓ అవినీతి కుంభకోణం కేసులో మంగళవారం అరెస్టయ్యారు. ఆయనను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అరెస్ట్ చేసింది. ఆయనను బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ కోర్టులో హాజరుపరుస్తారు. ఆయనను నాలుగైదు రోజులపాటు కస్టడీలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తామని ఎన్ఏబీ అధికారులు తెలిపారు.
పాక్ ప్రభుత్వ తాజా స్పందన
పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం చేసిన ప్రకటనలో ఇమ్రాన్ మద్దతుదారులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. నిరసనల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడింది. వీరు ఫాసిజంతో రెచ్చిపోతున్నారని, పీటీఐ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని వ్యాఖ్యానించింది.
ఇమ్రాన్ అరెస్ట్ చట్టబద్ధమే : పాక్ మంత్రి
ఇమ్రాన్ ఖాన్‌ను ఎన్ఏబీ చట్టబద్ధంగానే అరెస్టు చేసిందని పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ రణా సనావుల్లా చెప్పారు. ఎన్ఏబీ అనేది ఓ స్వతంత్ర వ్యవస్థ అని, అది ప్రభుత్వ నియంత్రణలో ఉండదని చెప్పారు.
నెమలిని దొంగిలించిన ఇమ్రాన్ మద్దతుదారుడు
ఇమ్రాన్ అరెస్ట్ వార్త తెలియడంతో ఆయన మద్దతుదారులు సైన్యంపై తమ కోపాన్ని ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వీరు హింసాత్మక సంఘటనలకు కూడా పాల్పడుతున్నారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు నిప్పు పెట్టారు. లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ ఇంటికి నిప్పు పెట్టి, అక్కడ ఉన్న ఓ నెమలిని పట్టుకెళ్లిపోయారు. దీనిని ప్రజాధనంతోనే కొన్నారని, అందుకే తాను దీనిని తీసుకెళ్తున్నానని ఆ వ్యక్తి చెప్పారు. రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ఇమ్రాన్ మద్దతుదారులు ముట్టడించారు. పీటీఐ ప్రధాన కార్యదర్శిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చట్టవిరుద్ధ అపహరణ
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ ఆయన అరెస్టును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఆయన అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగినట్లు ఇస్లామాబాద్ హైకోర్టు ప్రకటించడంపై అపీలు చేయనున్నట్లు బుధవారం తెలిపింది. ఇస్లామాబాద్ నుంచి లండన్ వరకు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపింది. పీటీఐ సీనియర్ నేత షా మహమూద్ ఖురేషీ మాట్లాడుతూ, ఇమ్రాన్‌ను చట్టవిరుద్ధంగా అపహరించారని, ఆయనను విడుదల చేసే వరకు నిరసనలను కొనసాగిస్తామని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధ ప్రవర్తనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలను, ప్రజలను కోరారు. తమ పార్టీ కార్యకర్తలపై రసాయనాలు కలిపిన నీటిని పోస్తున్నారని, విచక్షణ లేకుండా కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు. ముల్తాన్‌లోని తన కార్యాలయంపై దాడులు జరిగాయని, తన సిబ్బందిని తీవ్రంగా కొట్టారని తెలిపారు.
అమెరికా, కెనడాల్లో నిరసనలు
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీ బుధవారం అన్ని కాన్సులార్ అపాయింట్‌మెంట్లను రద్దు చేసింది. ఇమ్రాన్ విధేయుడు యాసర్ బుట్టర్ వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ వెలుపల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇమ్రాన్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు లండన్‌లో ఉన్న ఇంటి వద్ద పీటీఐ పార్టీ మద్దతుదారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, పెషావర్, ఫైజాబాద్ తదితర నగరాల్లో ఇమ్రాన్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా, కెనడాలలో కూడా ఇమ్రాన్ మద్దతుదారులు నిరసనలకు దిగారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రైవేటు ఇంటిని నిరసనకారులు తగులబెట్టారు.
ఇవి కూడా చదవండి :
Karnataka Election : ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. : ప్రముఖులు
Bajrang Dal row : మూర్ఖత్వానికి ఉదాహరణ.. కాంగ్రెస్‌పై నిర్మల సీతారామన్ ఆగ్రహం..