Share News

Kadaknath chicken: ఎన్నికల వేళ కడక్‌నాథ్ చికెన్‌కు భారీగా డిమాండ్.. ఒక కోడి ధర ఎంతో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-11-11T09:19:37+05:30 IST

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కడక్‌నాథ్ చికెన్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉండే ఝాబువా జిల్లాలో దొరికే కడక్‌నాథ్ కోళ్లలో అధిక మాంసకృతులు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాధారణ రోజుల్లో ఉండే ధర కన్నా ప్రస్తుతం 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది.

Kadaknath chicken: ఎన్నికల వేళ కడక్‌నాథ్ చికెన్‌కు భారీగా డిమాండ్.. ఒక కోడి ధర ఎంతో తెలిస్తే..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కడక్‌నాథ్ చికెన్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉండే ఝాబువా జిల్లాలో దొరికే కడక్‌నాథ్ కోళ్లలో అధిక మాంసకృతులు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాధారణ రోజుల్లో ఉండే ధర కన్నా ప్రస్తుతం 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది. ఝబువాలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్ చందన్ కుమార్ మాట్లాడుతూ “శీతాకాలం ప్రారంభమైంది. ఎన్నికల సమయం ఆసన్నమైంది. దీంతో కడక్‌నాథ్‌ చికెన్‌కు 30 నుంచి 40 శాతం మేర డిమాండ్ పెరిగింది. దేశవ్యాప్తంగా పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు కడక్‌నాథ్ జాతికి చెందిన స్వచ్ఛమైన కోళ్ల కోసం ఝబువాను ఆశ్రయిస్తున్నారు.’’ అని చెప్పారు.


ఎన్‌జీఓ సార సేవా సంస్థాన్ సమితి సీఈఓ సుధాంశు శేఖర్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు పౌల్ట్రీ ఫాం సంస్థలు తమ వ్యాపారంలో పుంజుకున్నాయని చెప్పారు. ‘‘ఎన్నికల సమయంలో డిమాండ్ పెరగడంతో సరఫరాను పెంచాల్సి వచ్చింది. దీంతో రూ.800 నుంచి రూ.1200గా ఉన్న కడక్‌నాథ్ కోడి ధర ప్రస్తుతం రూ.1200 నుంచి రూ.1500 వరకు పెరిగింది. ’’ అని తెలిపారు. భీల్ తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించే ఝాబువా ప్రాంతంలో కడక్‌నాథ్ కోళ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఈ కోళ్లు గిరిజనులకు ఆహారంతోపాటు ఆర్థికవ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నాయి. నల్లగా ఉండే కడక్‌నాథ్ కోళ్లను స్థానిక భాషలో ‘కాలమాసి’ అని పిలుస్తారు. దీన్ని ఈకలు, చర్మం, మాంసం కూడా నల్లగా ఉంటుంది. ఆదివాసీలు తమ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, తమ ఆచారాల్లో కడక్‌నాథ్ కోళ్లను బలిచ్చే సంప్రదాయం ఉంది. కడక్‌నాథ్ జాతికి చెందిన కోళ్ల మాంసమే కాకుండా గుడ్లు కూడా ఖరీదైనవి. 2018లో కడక్‌నాథ్ కోళ్లకు భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 17న జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Updated Date - 2023-11-11T09:19:39+05:30 IST