New Parliament : మోదీని ప్రశ్నిస్తూ, ప్రతిపక్షాలకు సలహా ఇచ్చిన కమల్ హాసన్

ABN , First Publish Date - 2023-05-27T17:33:52+05:30 IST

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలకు ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్

New Parliament : మోదీని ప్రశ్నిస్తూ, ప్రతిపక్షాలకు సలహా ఇచ్చిన కమల్ హాసన్
Kamal Haasan, Narendra Modi

చెన్నై : నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలకు ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ (Makkal Needhi Maiam) పార్టీ చీఫ్ కమల్ హాసన్ ఓ సలహా ఇచ్చారు. రాజకీయ విభేదాలకు ఓ రోజు విరామం ప్రకటించాలని, ఈ కార్యక్రమాలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించి, జాతీయ ఐకమత్య సంబరంగా దీనిని మార్చాలని కోరారు. అదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రశ్నను సంధించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాలకు రాష్ట్రపతి ఎందుకు హాజరు కాకూడదో చెప్పాలని నిలదీశారు.

మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం దేశానికి గర్వకారణమని తెలిపారు. అయితే ఇది రాజకీయంగా విభజనకు దారితీసిందని పేర్కొన్నారు. తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఓ ప్రశ్న అడుగుతున్నానన్నారు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదో దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి అధిపతి అయిన రాష్ట్రపతి ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామి కాకపోవడానికి ఎటువంటి కారణం తనకు కనిపించడం లేదన్నారు.

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష పార్టీలకు కూడా కమల్ హాసన్ హితవు పలికారు. రాజకీయ విభేదాలకు ఓ రోజు విరామం ఇవ్వవచ్చునన్నారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. దేశ ఐకమత్యాన్ని చాటే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మార్చాలని కోరారు. భారత దేశ నూతన గృహంలో కుటుంబ సభ్యులంతా నివసించాలన్నారు. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని తాను నమ్ముతానని తెలిపారు. అందుకే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నానని చెప్పారు.

అభ్యంతరాలుంటే..

ఈ కార్యక్రమం పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే బహిరంగ వేదికలపై కానీ, నూతన పార్లమెంటులో కానీ లేవనెత్తవచ్చునని తెలిపారు. మనల్ని విభజించేవాటి కన్నా కలిపి ఉంచేవి ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోవాలని కోరారు. యావత్తు దేశం ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తోందన్నారు. ప్రపంచం దృష్టి మనపై ఉందన్నారు.

అసమ్మతిని కొనసాగిస్తూనే..

నూతన పార్లమెంటు భవనాన్ని మే 28న ప్రారంభించడం యావత్తు దేశానికి సంబరాలు చేసుకునే సందర్భమని తెలిపారు. ఈ చరిత్రాత్మక విజయానికి భారత ప్రభుత్వాన్ని అభినందించారు. దేశ ప్రయోజనాల కోసం తాను అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది తనకు అత్యంత గర్వకారణమైన విషయమని తెలిపారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం పట్ల, ఈ కార్యక్రమంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయకపోవడం పట్ల తన అసమ్మతిని కొనసాగిస్తానని చెప్పారు.

రాష్ట్రపతికే అధికారం

పార్లమెంటు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టాలుగా మారుతాయన్నారు. పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి రాష్ట్రపతికే అధికారం ఉందన్నారు. పార్లమెంటు కార్యకలాపాల్లో రాష్ట్రపతి అంతర్భాగమని తెలిపారు. రాజీ ధోరణిని ప్రదర్శిస్తూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని మోదీని కోరారు. నూతన పార్లమెంటు అనేది కేవలం ఓ సాధారణ భవనం కాదని, చిరకాలం భారత దేశ ప్రజాస్వామ్య నిలయమని తెలిపారు. ఈ ఏమరుపాటు చరిత్రలో తీవ్ర తప్పిదంగా నమోదవుతుందని, దీనిని సరిదిద్దుకోవాలని మోదీని కోరారు. దీనిని సరిదిద్దుకుంటే రాజకీయ నాయకత్వంలో ఓ గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్నారు.

మోదీ చేతుల మీదుగా..

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో భాగంగా లోక్‌సభ సభాపతి ఆసనం వద్ద రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. కాంగ్రెస్ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తుండగా, తెదేపా, వైకాపా, ఎస్‌ఏడీ, బీజేడీ (BJD) వంటి ఎన్డీయేయేతర పార్టీలు హాజరవుతున్నాయి.

ప్రభుత్వాన్ని ప్రశంసించాలి : గులాం నబీ ఆజాద్

జమ్మూ-కశ్మీరుకు చెందిన డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ శనివారం మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో దేశ జనాభా దాదాపు ఐదు రెట్లు పెరిగిందని, పార్లమెంటేరియన్ల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో నూతన పార్లమెంటు భవనం అవసరం చాలా ఉందన్నారు. ఈ భవనాన్ని నిర్మించడం చాలా అవసరమని, తప్పనిసరి అని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేయడం తేలికైన విషయం కాదన్నారు. ఈ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారా? రాష్ట్రపతి ప్రారంభించారా? అనేది ముఖ్యమైన విషయం కాదన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ఎన్నుకోలేదని కాదని, ప్రతిపక్షాలు ద్రౌపది ముర్ముకు అంత అనుకూలం అయితే, ఆమెకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టారని ప్రశ్నించారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల క్రితం తాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసినపుడు కొత్త పార్లమెంటు భవన నిర్మాణం గురించి కలలు కనేవారమని చెప్పారు. అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్, తాను దీని గురించి చర్చించామని చెప్పారు. దీని కోసం ఓ మ్యాపును కూడా తయారు చేశామన్నారు. అప్పట్లో తాము దీనిని నిర్మించలేకపోయామని చెప్పారు. అయితే ఇప్పుడు దీనిని నిర్మించడం చాలా మంచి విషయమని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Ghaziabad: ఫుడ్ ప్యాకెట్‌లో ఉమ్మి వేసిన రెస్టారెంట్ ఉద్యోగి

Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు

Updated Date - 2023-05-27T17:33:52+05:30 IST