Congress: ఎన్నికల్లో ఘోర ఓటమి.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా?
ABN , First Publish Date - 2023-12-06T08:48:27+05:30 IST
డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. 163 స్థానాల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టింది.
డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. 163 స్థానాల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకుగాను 114 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి 66 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేయనున్నారని సమాచారం. మంగళవారం ఢిల్లీ వెళ్లిన కమల్‌నాథ్ కాంగ్రెస్ హైకమాండ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని కమల్‌నాథ్ కోరినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సమయయంలో సీట్ల పంపకాల విషయంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌తో సహా భారత కూటమికి చెందిన పలువురు నాయకులపై కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తితో ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కమల్‌నాథ్ మాట్లాడారు. ఈ ఓటమిని చూసి ఎవరూ నిరుత్సాహపడవద్దని అన్నారు. కొన్ని నెలల దూరంలో ఉన్న లోక్‌సభ ఎన్నికల సన్నాహకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ కార్యకర్తల మనో ధైర్యాన్ని పెంపొందించేందుకు ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ దిగ్గజాల కాలంలోనూ ఎమర్జెన్సీ అనంతరం 1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని అన్నారు. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న పార్టీ మూడు సంవత్సరాల అనంతరం జరిగిన 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. కాగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.