Karnataka SIT: బీజేపీకి ఉచ్చు...బిట్‌కాయిన్ కుంభకోణంపై 'సిట్'
ABN , First Publish Date - 2023-07-03T17:10:02+05:30 IST
బీజేపీ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో చోటుచేసుకున్న కుంభకోణాలపై సిద్ధరామయ్య సారథ్యంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2021లో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న బిట్ కాయిన్ కుంభకోణంపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర ప్రకటించారు.
బెంగళూరు: బీజేపీ (BJP) ప్రభుత్వ హయాంలో కర్ణాటక(Karnataka)లో చోటుచేసుకున్న కుంభకోణాలపై సిద్ధరామయ్య (Siddaramaiah) సారథ్యంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2021లో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న బిట్ కాయిన్ కుంభకోణంపై (Bitcoin Scam)విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర (G.Parameshwara) ప్రకటించారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ బిట్‌కాయిన్ కుంభకోణంపై బీజేపీ సర్కార్‌ను నిలదీసింది. ఈ కుంభకోణంలో బడా నేతల ప్రమేయం ఉండటంతో దానిని కప్పిప్పుచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఆరోపించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీకృష్ణ రమేష్ అలియాస్ శ్రీకి రాష్ట్ర ప్రభుత్వ ఇ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి, రూ.11.5 కోట్ల మేరకు దారి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. క్రిఫ్టో కరెన్సీ దొంగతనం, డ్రగ్ పెడ్లింగ్, సైబర్ ఫ్రాడ్ వంటి ఆరోపణలు కూడా వచ్చాయి.
అదనపు డీజిపీ సారథ్యంలో సిట్
కాగా, బిట్ కాయిన్ కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్‌కు అడిషన్ డీజీపీ మనీష్ ఖర్బీకర్ సారథ్యం వహిస్తారని, ఇందులో సైబర్ నేరానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నందున సాంకేతిక నిపుణుల సాయాన్ని ఆయన తీసుకుంటారని హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బిట్ కాయిన్ కుంభకోణంపై పునర్విచారణ జరుపుతామని గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసినట్టు ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సిఐడీ నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చామని చెప్పారు. సిట్ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేస్తుందని ఆశిస్తున్నామన్నారు. గత విచారణలో కొన్ని లోపాలున్నాయని, వాటిని కూడా సిట్ సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతుందని చెప్పారు. కేంద్ర ఏజెన్సీల సహాయం తీసుకునే అవకాశాలపై అడిగినప్పుడు, అవసరమైన సహాయం తీసుకోవాల్సిందిగా సిట్‌కు ఆదేశాలిచ్చామని మంత్రి చెప్పారు. బిట్ కాయిన్ కేసులను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయనున్నారా అనే మరో ప్రశ్నకు, తొలుత దర్యాప్తు ప్రారంభం కావాలని, దర్యాప్తు పురోగతి, లీగల్ కోణాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.