Uddhav Thackeray: ఎన్నికలకు పోదాం... సవాలు విసిరిన ఉద్ధవ్

ABN , First Publish Date - 2023-05-12T13:54:14+05:30 IST

ముంబై: శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే తమ ప్రత్యర్థి వర్గమైన ఏక్‌నాథ్‌ షిండేకు, బీజేపీకి సవాల్ విసిరారు. తాజా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు.

Uddhav Thackeray: ఎన్నికలకు పోదాం... సవాలు విసిరిన ఉద్ధవ్

ముంబై: శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav TaCkeray) తమ ప్రత్యర్థి వర్గమైన ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde)కు, బీజేపీకి సవాల్ విసిరారు. తాజా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ''మనమంతా తాజా ఎన్నికలకు వెళ్దాం. ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకుంటారు. నేను రాజీనామా ఇచ్చినట్టే, నైతిక బాధ్యత వహించి సీఎం (షిండే)కూడా రాజీనామా చేయాలని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉద్ధవ్ అన్నారు.

గత ఏడాది తిరుగుబాటు చేసి తన ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన శివసేన ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని, దీనిపై తగిన నిర్ణయం తీసుకోకుంటే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం స్పీకర్ విదేశాల్లో ఉన్నందున దీనిపై త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశంలో నిస్సిగ్గు వ్యవహారాలు జరుగుతున్నాయని, వాటిని ఆపాలని ప్రధానమంత్రిని తాను కోరుతున్నానని అన్నారు. మహారాష్ట్ర పేరుప్రతిష్ట్రలను దిగజార్జే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటివి జరగడానికి వీల్లేదని చెప్పారు.

మాజీ గవర్నర్‌పై చర్యకు ఉద్ధవ్ డిమాండ్

కాగా, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. ఒకరిపై చర్యలు తీసుకుంటే ఇతరులు ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయరని అన్నారు.

సుప్రీంకోర్టు ఏమి చెప్పింది?

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌, రాష్ట్ర శాసనవ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న సభాపతి తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోనే గత ఏడాది మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం పతనమైందని సర్వోన్నత న్యాయస్థానం గురువారంనాడు ఇచ్చిన తీర్పులో పేర్కొంది. గత ఏడాది జూన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రేను విశ్వాస పరీక్షకు ఆహ్వానించడంలో గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం తప్పేనని రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తేల్చిచెప్పింది. స్పీకర్‌, ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం విషయంలో తప్పించుకునే ధోరణిని ప్రదర్శించినప్పుడే, మంత్రివర్గం సలహాలు లేకుండానే గవర్నర్‌కు జోక్యం చేసుకునే అధికారం ఉంటుందని పేర్కొంది. విశ్వాస పరీక్ష విషయంలో కాదని పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఒక రాజకీయ పార్టీ అంతర్గత వివాదంలో, పార్టీల మధ్య వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారాన్ని రాజ్యాంగం గానీ, చట్టం గానీ గవర్నర్‌కు ఇవ్వలేదని, కేవలం అనర్హతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు రాసిన లేఖను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రిని విశ్వాస పరీక్షకు ఆహ్వానించడం తప్పేనని తెలిపింది. సీఎం పదవికి ఉద్ధవ్‌ రాజీనామా చేశాక బీజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు శిందే వర్గాన్ని గవర్నర్‌ ఆహ్వానించడాన్ని సమర్థించింది. చీఫ్‌విప్‌ విషయంలోనూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. చీఫ్‌ విప్‌ విషయంలో స్పీకర్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. శిందే వర్గంపై అనర్హత పిటిషన్ల విచారణను ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-12T13:56:53+05:30 IST