Ajit Pawar: క్లారిటీ ఇచ్చిన అజిత్ పవార్... ఇంతకూ ఎన్సీపీలో ఏం జరుగుతోంది?
ABN , First Publish Date - 2023-04-18T16:12:57+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని తాను చీల్చబోతున్నట్లు వస్తున్న మీడియా కథనాలపై ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) స్పందించారు.
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని తాను చీల్చబోతున్నట్లు వస్తున్న మీడియా కథనాలపై ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) స్పందించారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. తాను భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్నవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని ఆయన మీడియా ప్రతినిధులకు ముంబైలో చెప్పారు. తాను ఇప్పటివరకూ ఏ ఎమ్మెల్యే సంతకమూ తీసుకోలేదన్నారు. పుకార్లకు చెక్ పెట్టాలని సూచించారు. ఎన్‌సీపీ ఎమ్మెల్యేల సమావేశాన్ని తాను ఏర్పాటు చేయలేదని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
అంతకు ముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) కూడా అజిత్ పవార్ పార్టీని చీలుస్తున్నారని వస్తున్నవన్నీ పుకార్లేనని తోసిపుచ్చారు. అజిత్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారని శరద్ పవార్ చెప్పారు. పుకార్లన్నీ మీడియా సృష్టేనని చెప్పారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశమూ జరగలేదన్నారు.
అంతకుముందు ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, అజిత్ పవార్ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు. బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వారసునిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఈ కథనం తెలిపింది. ఎన్‌సీపీ ఎమ్మెల్యేల మద్దతును ఆయన కూడగడుతున్నారని తెలిపింది.
ఎన్‌సీపీకి ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సుమారు 40 మంది అజిత్ పవార్ వైపు ఉన్నట్లు ఈ కథనం తెలిపింది. వీరందరూ సంతకాలు చేసిన మద్దతు లేఖను సమయం వచ్చినపుడు గవర్నర్‌కు సమర్పించాలని నిర్ణయించారని తెలిపింది. ఈ వివరాలను ఎన్‌సీపీ ముఖ్య నేతలు చెప్పినట్లు వివరించింది.
2019లో అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు శరద్ పవార్ ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, పార్టీని ముక్కలు కాకుండా అడ్డుకోగలిగారు. శివసేన (ఉద్ధవ్ బాల్ థాకరే) వర్గం నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, అజిత్ పవార్ తిరుగుబాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవని చెప్పారు. తాను మంగళవారం ఉదయం అజిత్ పవార్‌తోనూ, ఇతర ఎన్‌సీపీ నేతలతోనూ మాట్లాడానని తెలిపారు. మహావికాస్ అగాడీ కూటమిని బలహీనపరచాలనే ఉద్దేశంతోనే ఇటువంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారన్నారు. తమను బలహీనపరచగలమనుకోవడం పొరపాటు అని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే కూడా అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారని వచ్చినవన్నీ పుకార్లేననన్నారు. తనతో దీనిపై ఎవ్వరూ చర్చించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
అజిత్ పవార్ బీజేపీతో సన్నిహితంగా మెలగుతున్నారని, ఎన్‌సీపీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది ఆయన వెంట ఉన్నారని మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. అన్నీ పుకార్లేనని, తాను అజిత్ పవార్‌తో, ఎన్సీపీ నేతలతో మాట్లాడానని కూడా ఆయన చెప్పారు. ఇలాంటి పుకార్ల వల్ల మహా వికాస్ అఘాడీకి వచ్చిన చిక్కేమీ లేదన్నారు. ఇలాంటి పుకార్లు తమను ఏమీ చేయలేవన్నారు.
అజిత్ పవార్ ఇటీవలే ఈవీఎంలపై సందేహాలు అవసరం లేదన్నారు. ఈవీఎంలను దుర్వినియోగం చేయడమే నిజమైతే పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీయేతర పార్టీలు ఎలా ఏర్పాటౌతాయని అజిత్ పవార్ ప్రశ్నించారు.
శరద్ పవార్ కూడా ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హతలపై ప్రతిపక్షాలు ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. ప్రధాని విద్యార్హతల అంశం ప్రజాసమస్య కాదన్నారు. అదానీపై జేపీసీ డిమాండ్‌పై కూడా శరద్ పవార్ ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. అదానీ దేశానికి చేసిన సేవను కూడా గుర్తించాలన్నారు. అదానీ అంశం కూడా ప్రజా సమస్య కాదన్నారు. దీంతో ప్రతిపక్షాల్లో కలకలం రేగింది. విపక్షాల్లో చీలిక ఏర్పడినట్లుగా భావిస్తున్నారు. అందుకే బీహార్ సీఎం నితీశ్‌ను కాంగ్రెస్ నేతలు తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. ఎన్సీపీ కర్ణాటక అసెంబ్లీ రాజకీయాల్లో కూడా పోటీ చేయనుంది. దీంతో కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Yogi Adityanath: ఆరేళ్లలో 183 ఎన్‌కౌంటర్లు.. మాఫియా డాన్‌ల పాలిట సింహస్వప్నం
Shaista Parveen: అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ కోసం జల్లెడ పడుతున్న యూపీ పోలీసులు..