Maharashtra : సీఎం షిండే వర్గంలో అసంతృప్తి సెగలు
ABN , First Publish Date - 2023-07-05T14:36:48+05:30 IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్‌సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్‌సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు. తమ నేత షిండే తదుపరి కార్యాచరణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు.
శివసేన (ఏక్‌నాథ్ షిండే) నేత సంజయ్ సిర్సత్ బుధవారం మాట్లాడుతూ, అజిత్ పవార్ వర్గం రాష్ట్ర ప్రభుత్వంలో చేరడం పట్ల తమ పార్టీ నేతలు సంతోషంగా లేరన్నారు. తాము కోరుకుంటున్న స్థానం తమకు దక్కదేమోనని తమ వర్గం ఎమ్మెల్యేలు భావిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు తమతో కలవాలని కోరుకున్నపుడు, వారిని చేర్చుకోవాలన్నారు. బీజేపీ ఆ పనే చేసిందన్నారు. అయితే తమ వర్గంలోని ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారనడం వాస్తవం కాదన్నారు. ముఖ్యమంత్రి షిండే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లకు తాము తమ అభిప్రాయాలను చెప్పామన్నారు. సమస్యను పరిష్కరించవలసినది వారేనని చెప్పారు. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ప్రభుత్వాన్ని శరద్ పవార్ నడిపించేవారన్నారు. తాము ఎన్‌సీపీకి ఎల్లప్పుడూ వ్యతిరేకమేనని, శరద్ పవార్‌ను ఇప్పటికీ వ్యతిరేకిస్తామని తెలిపారు.
ఇదిలావుండగా, తొమ్మిది మంది ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్‌ను కోరింది.
శరద్ పవార్‌కు ఝలక్ ఇచ్చిన అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు జూలై 2న ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబైలోని బాంద్రా, ఎంఈటీ భుజ్‌బల్ నాలెడ్జ్ సిటీలో ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా శరద్ పవార్ వైబీ చవాన్ సెంటర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
ఇవి కూడా చదవండి :
Destination weddings: శివపార్వతులు సత్య యుగంలో పెళ్లి చేసుకున్న చోట పెరుగుతున్న పెళ్లిళ్లు
Quran Desecration : స్వీడన్‌లో ఖురాన్‌కు అవమానం.. పాకిస్థాన్ ప్రభుత్వం నిరసన..