Maharashtra politics: ‘మహా’ అంకంలో మరో మలుపు!

ABN , First Publish Date - 2023-08-17T03:23:30+05:30 IST

మహారాష్ట్ర రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్‌(Sharad Pawar) తన బంధువు, ఎన్సీపీ చీలికవర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌(Ajit Pawar)తో రహస్యంగా భేటీ అయినట్టు, కేంద్ర మంత్రివర్గం(Union Cabinet) లో చేరేలా అజిత్‌ ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టు వచ్చిన వార్తలతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

Maharashtra politics: ‘మహా’ అంకంలో మరో మలుపు!

ఎవరికీ అంతుచిక్కని శరద్‌ చతురత

బయటపడ్డ అజిత్‌- పవార్‌ రహస్యభేటీ

శరద్‌కు కేంద్ర క్యాబినెట్‌ అంటూ వార్తలు

వాటిని ఖండించని ఎన్సీపీ అధినేత

మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమిలో కలకలం

ముంబై, ఆగస్టు 16: మహారాష్ట్ర రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్‌(Sharad Pawar) తన బంధువు, ఎన్సీపీ చీలికవర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌(Ajit Pawar)తో రహస్యంగా భేటీ అయినట్టు, కేంద్ర మంత్రివర్గం(Union Cabinet) లో చేరేలా అజిత్‌ ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టు వచ్చిన వార్తలతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ కథనాలను పవార్‌ ఖండించలేదు. అయితే, అటు మణిపూర్‌(Manipur) అంశంలో ప్రధాని మోదీని బుధవారం తూర్పారరబట్టి.. ఇక్కడి రాజకీయాల్ని గందరగోళపరిచారు. పుణెలోని ఓ వ్యాపారి నివాసంలో శరద్‌, అజిత్‌లు గత శనివారం రహస్యంగా కలుసుకున్న వ్యవహారం మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమిలో కాక రేపింది. శరద్‌ పవార్‌ను ఎన్డీయేలో చేరేలా ఒప్పించేందుకు ఈ భేటీలో అజిత్‌ ప్రయత్నించారని సమాచారం. అది నిజమేనని ఒప్పుకున్న శరద్‌, తనకు మాత్రం ఎన్డీయేలోకి వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీల్లో ఏ పార్టీతో ఉంటారనేది ఎవరికి వారు తేల్చుకోవాలంటూ ఎన్సీపీ మిత్రపక్షం కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

చవాన్‌ వ్యాఖ్యలను మీడియా శరద్‌ దృష్టికి తీసుకెళ్లగా, కుటుంబ పెద్దగా తాను అజిత్‌ను కలిసిన విషయం నిజమని అంగీకరించడం ఆసక్తికరం. మరోవైపు శరద్‌ పవార్‌ మహారాష్ట్ర ప్రజల మనస్సుల్లో అనుమానం రేగే పనులేవీ శరద్‌ పవార్‌ చేయబోరంటూ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆయన్ను వెనకేసుకొచ్చారు. కాగా, ఇద్దరు పవార్‌ల భేటీపై శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ఆచితూచి స్పందించారు. రాజకీయాలు వేరయినా ఒకే కుటుంబంగా జీవించే సంప్రదాయం మొదటినుంచీ ఉన్నదని, పుణె భేటీ కూడా అందులో భాగమేనని ఆమె తేల్చేశారు. మరోవైపు, ఎన్సీపీలోని బలమైన నేత, మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌ మద్దతు కోసం ఇరు చీలిక వర్గాలూ ప్రయత్నిస్తున్నాయి.

Updated Date - 2023-08-17T04:48:12+05:30 IST