Disqualification pleas: శివసేన వర్గాల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షురూ..
ABN , First Publish Date - 2023-09-25T19:22:23+05:30 IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరుకావాలని 53 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవల నోటీసులు పంపారు.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై (Disqulification petions) అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ (Rahul Narwekar) సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరుకావాలని 53 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవల నోటీసులు పంపగా, వీరిలో 40 మంది షిండే వర్గానికి, 13 మంది ఎమ్మెల్యేలు థాకరే వర్గానికి చెందిన వారున్నారు. కాగా, నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది తమ తరఫు లాయర్లను విచారణకు పంపారు.
ఉద్ధవ్ థాకరే వర్గంతో తెగతెంపులు చేసుకున్న ఏక్‌నాథ్ షిండే 2022 జూన్‌లో బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమదే అసలైన శివసేన వర్గంగా ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. ఉద్ధవ్ థాకరే సైతం శివసేన తమదేనని, పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అత్యధిక ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నందున థాకరే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ షిండే సైతం స్పీకర్‌ను ఆశ్రయించారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో వారంలోగా చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం గతవారంలో నార్వేకర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మొత్తం తనకు అందిన 34 పిటిషన్లపై స్పీకర్ విచారణను ప్రారంభించారు.
మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై గత మే 11న సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ, మహారాష్ట్ర సీఎంగా షిండే కొనసాగుతారని, షిండే తిరుగుబాటు తర్వాత అసెంబ్లీలో బలపరీక్షకు వెళ్లకుండా ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసినందున తిరిగి మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటుకు ఆదేశించలేమని స్పష్టం చేసింది.