Bypolls Results Effect: దీదీ సంచలన ప్రకటన
ABN , First Publish Date - 2023-03-02T17:55:16+05:30 IST
ఉప ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్ధిని కాంగ్రెస్ (Congress) పార్టీ ఓడించడంతో ఆమె కీలక ప్రకటన చేశారు.
కోల్‌కతా: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమబెంగాల్‌లోని సాగర్దిగి(Sagardighi) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై తృణమూల్ అధినేత్రి(TMC), పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ఉప ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్ధిని కాంగ్రెస్ (Congress) పార్టీ ఓడించడంతో ఆమె కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్-సీపీఎం-బీజేపీ అనైతిక పొత్తు వల్లే కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందారని ఆమె ఆరోపించారు. బీజేపీ ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్ధికి పడేలా కుట్ర చేశారని మమత ఆరోపించారు. సాగర్దిగి తమ పార్టీ అభ్యర్థి ఓటమితో ఆమె షాక్‌లో పడిపోయారు. అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో(2024 elections) ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఒంటరిగా పోటీ చేస్తామని దీదీ ప్రకటించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆమె అతి పెద్ద షాకిచ్చారు. తాము కాంగ్రెస్‌తో చేతులు కలిపేదే లేదన్నారు. మరోవైపు తృణమూల్ అభ్యర్ధి దేబాశీష్ బెనర్జీని కాంగ్రెస్ బేరోన్ బిశ్వాస్ చిత్తుగా ఓడించడంపై పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. పోలీసుల అండతో ప్రజలను పీడించి, బెదిరించి అనేకసార్లు తృణమూల్ గెలిచిందని అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఇక అన్నీ విజయాలేనని అధిర్ రంజన్ చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. తృణమూల్ పార్టీ ముస్లింలను వంచించిందని ఆయన ఆరోపించారు.
అధిర్ రంజన్ చౌదరి ఆరోపణలను మమత తోసిపుచ్చారు. తమకు మైనార్టీలు, మెజార్టీలు అందరూ సమానమేనన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో(2024 elections) ఒంటరిగా వెళ్తామంటూ మమత చేసిన ప్రకటన కాంగ్రెస్‌కు శరాఘాతంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి మేలు చేసే అవకాశం కూడా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని తృణమూల్‌కు గట్టి సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూటమిగా నిలవకపోతే కమలనాథుల హవాను అడ్డుకోవడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు వేర్వేరుగా పోటీచేస్తే బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతుననారు.