Pakistan : సీమాను తిప్పి పంపకపోతే భారీ ఉగ్ర దాడి.. ముంబై పోలీసులకు బెదిరింపు కాల్..

ABN , First Publish Date - 2023-07-14T14:19:50+05:30 IST

భారత దేశంలోని ప్రియుడి కోసం వచ్చానని చెప్తున్న పాకిస్థానీ మహిళ సీమా గులాం హైదర్‌ను తిరిగి పాకిస్థాన్‌కు పంపించాలని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు ముంబై పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఆమెను తిరిగి పాకిస్థాన్‌కు పంపించకపోతే 26/11 ముంబై ఉగ్రవాద దాడి తరహాలో భారీ ఉగ్ర దాడి జరుగుతుందని ఆ కాలర్ హెచ్చరించినట్లు తెలిపారు.

Pakistan : సీమాను తిప్పి పంపకపోతే భారీ ఉగ్ర దాడి.. ముంబై పోలీసులకు బెదిరింపు కాల్..
Sachin Meena, Seema Haider

ముంబై : భారత దేశంలోని ప్రియుడి కోసం వచ్చానని చెప్తున్న పాకిస్థానీ మహిళ సీమా గులాం హైదర్‌ను తిరిగి పాకిస్థాన్‌కు పంపించాలని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు ముంబై పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఆమెను తిరిగి పాకిస్థాన్‌కు పంపించకపోతే 26/11 ముంబై ఉగ్రవాద దాడి తరహాలో భారీ ఉగ్ర దాడి జరుగుతుందని ఆ కాలర్ హెచ్చరించినట్లు తెలిపారు. ఓ యాప్ ద్వారా ఈ కాల్ వచ్చిందని, కాలర్ ఐపీ అడ్రస్‌ను గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

సీమాను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆమె చెప్పిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే ఆమె మాటలను కొందరు అనుమానంతో పరిశీలిస్తున్నారు. ఆమె పాకిస్థాన్ పంపించిన గూఢచారి అయి ఉండవచ్చునని అంటున్నారు. ఇదిలావుండగా, సీమా (30), ఆమె ప్రియుడు సచిన్ మీనా (25) మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, సచిన్ మీనా ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉంటున్నారు. ఆయన ఓ కిరాణా దుకాణం నడుపుతున్నారు. ఆయనకు పబ్‌జీ పిచ్చి ఎక్కువ. 2019లో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంటున్న సీమా గులాం హైదర్ టచ్‌లోకి వచ్చారు. వీరిద్దరూ ప్రతి రోజూ గంటల తరబడి పబ్‌జీ ఆడేవారు. క్రమంగా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి భారత దేశానికి నేపాల్ గుండా వచ్చింది. సచిన్ మీనాను కలిసింది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆ పాకిస్థానీ మహిళ వీసా లేకుండా, చట్టవిరుద్ధంగా మన దేశంలో ప్రవేశించినట్లు గుర్తించి, ఆమెను, సచిన్‌ను, ఆయన తండ్రిని అరెస్ట్ చేశారు. కోర్టు ఈ ముగ్గురికీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సీమ వెంట వచ్చిన పిల్లల్లో ముగ్గురు బాలికలు, ఓ బాలుడు ఉన్నారు. వీరందరి వయసు ఏడేళ్ల లోపునే ఉంటుంది. ఈ పిల్లలు కూడా ఆమెతో కలిసి జైలులోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం తమకు బెదిరింపు కాల్ వచ్చిందని ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాలర్ ఉర్దూలో మాట్లాడారని, సీమాను తిరిగి పాకిస్థాన్‌కు పంపించకపోతే, 26/11 ముంబై దాడుల తరహాలో భారీ ఉగ్రవాద దాడి జరుగుతుందని, దీనికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిపారు. ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ బృందం ఈ కాల్‌పై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఓ యాప్ ద్వారా ఈ కాల్ వచ్చిందని, కాలర్ ఐపీ అడ్రస్‌ను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Modi France Visit : ఫ్రాన్స్‌లో భారతీయ కరెన్సీలో యూపీఐ చెల్లింపులు.. పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు.. : మోదీ

Kosovo Parliament : కొసావో పార్లమెంటులో కొట్లాట.. పిడిగుద్దులతో తలపడిన ఆడ, మగ సభ్యులు..

Updated Date - 2023-07-14T14:19:50+05:30 IST