Kerala : రూ.15 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం : ఎన్‌సీబీ
ABN , First Publish Date - 2023-05-13T20:45:35+05:30 IST
కేరళ తీరంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అక్రమంగా మన దేశానికి తరలిస్తున్న రూ.15 వేల కోట్ల విలువైన
తిరువనంతపురం : కేరళ తీరంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అక్రమంగా మన దేశానికి తరలిస్తున్న రూ.15 వేల కోట్ల విలువైన ‘హై ప్యూరిటీ’ మీథాంఫెటమైన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ పాకిస్థాన్ జాతీయుడిని అరెస్ట్ చేశారు. భారత నావికా దళంతో కలిసి ఎన్‌సీబీ ఈ ఆపరేషన్ సముద్రగుప్తను నిర్వహించింది.
ఎన్‌సీబీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ‘మదర్ షిప్’ను భారత దేశ దర్యాప్తు సంస్థ అడ్డుకుని, తనిఖీలు జరపడం ఇదే మొదటిసారి. ‘డెత్ క్రెసెంట్’ నుంచి వస్తున్న ఈ ‘హై ప్యూరిటీ’ మీథాంఫెటమైన్ విలువ రూ.15,000 కోట్లు ఉంటుందని అంచనా. దీని బరువు 2,500 కేజీలు. కేరళ తీరంలో భారతీయ జలాల్లో దీనిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌక శ్రీలంకకు వెళ్తోంది. మొత్తం మూడు పడవలను స్వాధీనం చేసుకున్నారు. చీకట్లో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.
గడచిన ఏడాదిన్నర కాలంలో సదరన్ రూట్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇది మూడోసారి. మక్రన్ తీరం నుంచి పెద్ద ఎత్తున మీథాంఫెటమైన్ రవాణా అవుతోందని సమాచారం అందడంతో భారత నావికా దళానికి చెందిన ఇంటెలిజెన్స్ వింగ్, ఎన్‌సీబీ సంయుక్తంగా ఆపరేషన్ సముద్రగుప్తను నిర్వహించాయి. మదర్ షిప్‌లో మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ, మార్గమధ్యంలో వాటిని పంపిణీ చేస్తారు. అటువంటి మదర్ షిప్‌ను భారతీయ ఏజెన్సీలు పట్టుకోవడం ఇదే మొదటిసారి.
ఆపరేషన్ సముద్రగుప్త అంటే..
హిందూ మహా సముద్రం ప్రాంతంలో హెరాయిన్, ఇతర మాదక ద్రవ్యాలను సముద్ర మార్గంలో రవాణా చేస్తూ, పంపిణీ చేస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారు. ఈ ముప్పును తప్పించేందుకు ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్ 2022 జనవరిలో ఆపరేషన్ సముద్రగుప్తను ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి :
JDS KumaraSwamy: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!
DK Shivakumar: భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే