NCP : శరద్ పవార్‌తో అజిత్ పవార్ వర్గం భేటీ
ABN , First Publish Date - 2023-07-16T16:21:04+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)పై నియంత్రణ సాధించేందుకు పోరాటం జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar)తో రెబెల్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)పై నియంత్రణ సాధించేందుకు పోరాటం జరుగుతున్న సమయంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar)తో రెబెల్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ముఖ్య నేత ప్రఫుల్ పటేల్, మంత్రులు దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్, ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, అదితి తత్కరే, ఉప సభాపతి నరహరి జీర్వాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’ సమీపంలోని వైబీ చవాన్ సెంటర్‌లో ఆదివారం ఈ భేటీ జరిగింది.
తిరుగుబాటుకు ముందు శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, శరద్ పవార్ తమ దేవుడని, ఆయన ఆశీర్వాదాల కోసం వచ్చామని తెలిపారు. ఎన్‌సీపీ ఐక్యంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, దీనిని పరిశీలించి, తమకు మార్గదర్శనం చేయాలని ఆయనను కోరామని తెలిపారు. కానీ ఆయన కేవలం తాము చెప్పిన మాటలను విన్నారని, ఏమీ స్పందించలేదని తెలిపారు. ఆయనకు సమాచారం ఇవ్వకుండా తాము ఇక్కడికి వచ్చామన్నారు. ఆయన కార్యాలయంలో ఉన్నట్లు తెలుసుకుని, ఆయన ఆశీర్వాదాలు పొందడం కోసం వచ్చామని తెలిపారు.
ఎన్‌సీపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు, శరద్ పవార్ వర్గం నేత జయంత్ పాటిల్ మాట్లాడుతూ, తనకు శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే ఫోన్ చేశారని, అత్యవసరంగా వైబీ చవాన్ సెంటర్‌కు వెళ్లాలని చెప్పారని, అందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. తాము తమ వైఖరికి కట్టుబడి ఉన్నామన్నారు. తిరుగుబాటు అనంతరం శరద్ పవార్ వర్గంలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, రెబెల్స్ తిరిగి సొంత గూటికి వస్తామంటే, తమ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. పాటిల్‌తోపాటు శరద్ పవార్ వర్గంలోని నేత జితేంద్ర అవహద్ కూడా వైబీ చవాన్ సెంటర్‌కు చేరుకున్నారు.
ఇదిలావుండగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం, శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలేకు కేంద్ర మంత్రి పదవి వచ్చేలా చేస్తామని అజిత్ పవార్ వర్గం శరద్ పవార్‌కు చెప్పినట్లు తెలిసింది.
మరోవైపు బెంగళూరులో సోమ, మంగళవారాల్లో ప్రతిపక్షాల సమావేశం జరగబోతున్న తరుణంలో ఈ రసవత్తర సన్నివేశం కనిపించింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెలలో పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల మొదటి సమావేశంలో శరద్ పవార్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
S Jaishankar : ఉత్తమ దౌత్యవేత్త హనుమంతుడు : ఎస్ జైశంకర్
Yamuna Floods : ఢిల్లీలో మళ్లీ కురుస్తున్న వర్షాలు.. యమునా నదిలో ప్రమాద స్థాయి దాటిన నీటి మట్టం..