Sharad Pawar: ఇఫ్తార్ వేళ యోగి సర్కారుపై శరద్ పవార్ విమర్శలు
ABN , First Publish Date - 2023-04-18T21:56:31+05:30 IST
పాలకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దేశానికి మంచిది కాదని ముంబైలో ఓ ఇఫ్తార్ విందుకు హాజరైన సందర్భంగా పవార్ చెప్పారు.
ముంబై: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ (Ashraf) హత్యలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (NCP chief Sharad Pawar ) పరోక్షంగా స్పందించారు. దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలని సూచించారు. అంతేకాదు ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పుదోవ పట్టినట్లు అవుతుందన్నారు. పాలకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దేశానికి మంచిది కాదని ముంబైలో ఓ ఇఫ్తార్ విందుకు హాజరైన సందర్భంగా పవార్ చెప్పారు.
మరోవైపు అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ (Ashraf) హత్యల తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తొలిసారి స్పందించారు. యూపీలో ఇక మాఫియా పేరుతో ఎవ్వరినీ బెదిరించలేరని చెప్పారు. 2017కు ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉండేవని, నిత్యం అల్ల్ర్లతో చెడ్డపేరు ఉండేదని యోగి గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మాఫియా అంతుచూశామన్నారు. యూపీ ప్రగతి బాటలో నడుస్తోందన్నారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కొనసాగుతుందన్నారు. లక్నోలో జరిగిన సమావేశంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ (Ashraf) హత్యలపై నియమించిన జ్యుడీషియల్ కమిషన్, సిట్ పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ తరుణంలో పోలీసుల దృష్టి అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్(Shaista Parveen)పై పడింది. అతీఖ్, అష్రఫ్‌ల అంత్యక్రియలకు కూడా ఆమె హాజరుకాకపోవడంతో ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు జల్లెడ పడుతున్నారు. అంత్యక్రియలకు షైస్తా పర్వీన్ తప్పకుండా హాజరవుతారని ప్రచారం జరిగినా అలా హాజరుకాలేదు. పరారీలో ఉన్న ఆమె తలపై 50 వేల రూపాయల రివార్డ్ కూడా ఉంది. భర్తను హత్య చేశారని తెలియగానే షైస్తా పర్వీన్ వెక్కివెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోయారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. షైస్తా పర్వీన్ లొంగిపోతారనే ప్రచారం ఉత్తిదే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతీఖ్ అహ్మద్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో షైస్తా పర్వీన్ కీలకంగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ఫిబ్రవరి 24న న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య సమయంలో బాంబులు విసిరిన గుడ్డూ ముస్లిం (Guddu Muslim) కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తాజాగా అతడి కదలికలు కర్ణాటకలో బయటపడినట్లు సమాచారం. ఉమేశ్ పాల్‌పై అతీఖ్ తనయుడు అసద్, అతడి స్నేహితుడు గులాం కాల్పులు జరుపుతుండగా గుడ్డూ ముస్లిం నాటు బాంబులు విసిరాడు. నాటు బాంబులు అత్యంత వేగంగా తయారు చేయడంతో పాటు విసరడంలోనూ గుడ్డూ ముస్లిం నిపుణుడని, అతీఖ్ మాఫియా గ్యాంగ్‌లో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో గుడ్డూ ముస్లిం ఆచూకీ బయటపడితే అతీఖ్ నేర సామ్రాజ్యానికి, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు, ఐఎస్ఐకి ఉన్న సంబంధాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ను కాల్చి చంపిన లవ్లేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యలను భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాగ్ రాజ్ జైలు నుంచి నిన్న ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలించారు.
అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ను ఈ నెల 15న ప్రయాగ్‌రాజ్‌లోని కెల్విన్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా.. లవ్లేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్య మెడలో మీడియా ఐడీ కార్డులు ధరించి, అక్కడకు చేరుకున్నారు. దుండగుల్లో ఒకడు అతీక్ కణతపై రివాల్వర్‌ను పెట్టి, ట్రిగ్గర్ నొక్కేశాడు. అతీక్ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే దుండగులు అష్రాఫ్ వైపు వచ్చి.. అతణ్నీ కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా.. కుప్పకూలిన ఆ ఇద్దరిపై కాల్పులను కొనసాగించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ ముగ్గురూ తమకు అతీక్‌తో ఉన్న పాతకక్షల వల్లే ఆ ఘాతుకానికి పాల్పడ్డట్లు అంగీకరించినట్లు తెలిసింది. అంతే కాదు ఈ హత్య ద్వారా మాఫియాలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవడం కూడా లక్ష్యమని విచారణలో చెప్పినట్లు సమాచారం.