Sharad Pawar: ఎన్సీపీ సంక్షోభం ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. శరద్ పవార్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-07-03T14:35:40+05:30 IST

అజిత్ పవార్(Ajit Pawar) తిరుగుబాటుపై ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను బీజేపీ(BJP) నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sharad Pawar: ఎన్సీపీ సంక్షోభం ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. శరద్ పవార్ ఏమన్నారంటే..

మహారాష్ట్ర: అజిత్ పవార్(Ajit Pawar) తిరుగుబాటుపై ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను బీజేపీ(BJP) నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో బీజేపీ భయాన్ని స‌ృష్టిస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో, దేశంలో కులాల పేరుతో, మతాల పేరుతో బీజేపీ సమాజంలో చీలికలు తెస్తోందని ఆరోపించారు. త్వరలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మిస్తానని శరద్ పవార్ ప్రతిజ్ఞ చేశారు. నేడు గురు పూర్ణిమ సందర్భంగా తన రాజకీయ గురువు, మహారాష్ట్ర మొదటి ముఖ్యమంతి యశ్వంతరావు చవాన్‌ సమాధి వద్ద శరద్ పవార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడికి భారీగా తరలి వచ్చిన మద్దతుదారులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసగించారు.

‘‘మత శక్తులకు వ్యతిరేకంగా ఈ రోజు నుంచి నా పోరాటం ప్రారంభమవుతుంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో నేను అధైర్యపడడం లేదు. ప్రజల మధ్యకు వెళ్లి పార్టీని మళ్లీ పునర్నిర్మిస్తాను. ఎన్సీపీని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించిన వారికి మా సత్తా ఏంటో చూపిస్తాం ’’ అని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.

సోమవారం ఉదయం పూణే నుంచి కరాద్‌కు శరద్ పవార్ వెళ్తుండగా.. ఆయనకు స్వాగతం పలకడానికి దారి పొడవునా వేలాది మంది మద్దతుదారులు బారులు తీరారు. కరాద్ స్థానిక ఎమ్మెల్యే బాలాసాహెబ్ పాటిల్‌తోపాటు డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే మకరంద్ పాటిల్ కూడా శరద్ పవార్‌కు స్వాగతం పలకడం కొసమెరుపు. మార్గ మధ్యంలో వాహనాన్ని ఆపిన శరద్ పవార్ మద్దతుదారులను కలుసుకున్నారు. కాగా ఆదివారం తిరుగుబాటు చేసిన ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి ఏక్‌నాథ్ శిండే ప్రభుత్వంలో చేరారు. తనకు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు రాజ్‌భవన్‌కు సమర్పించిన లేఖలో అజిత్ పవార్ పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ఏం జరిగిందంటే..

రసవత్తర రాజకీయాలకు పేరుగాంచిన మహారాష్ట్రలో పెను సంచలనం.. సరిగ్గా ఏడాది కిందట అధికారం కోల్పోయిన మహా వికాస్‌ అఘాడీకి భారీ కుదుపు.. ఆ కూటమికి పునాది వేసిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ప్లేటు ఫిరాయించింది..! ఏకంగా ఏక్‌నాథ్‌ శిందే-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరిపోయింది. ఉరుము లేని పిడుగులా.. ఆదివారం అనూహ్య పరిణామాలు జరిగిపోయాయి. బీజేపీకి అనుకూలంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆడిస్తున్న నాటకంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి ఆయన సోదరుడి కుమారుడు, అత్యంత కీలక నేత అజిత్‌ పవార్‌ కావడం గమనార్హం. ఆగమేఘాలపై చోటుచేసుకున్న రాజకీయ మార్పుల విషయానికి వస్తే మహారాష్ట్ర ప్రతిపక్ష నేత అజిత్‌ ఆదివారం మధ్యాహ్నం తొలుత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో స్వగృహం దేవ్‌గిరిలో సమావేశమయ్యారు.

ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే సైతం ఇందులో పాల్గొన్నారు. ఆమె మధ్యలోనే వెళ్లిపోగా, అజిత్‌ మాత్రం సీఎం శిందేతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ సీనియర్‌ నేత చగన్‌ బుజబల్‌ సహా 9 మందితో రాజ్‌భవన్‌కు చేరకున్నారు. శిందే కూడా అక్కడికి రావడం అజిత్‌తో ఉప ముఖ్యమంత్రిగా గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ ప్రమాణ స్వీకారం చేయించడం వెంటవెంటనే జరిగిపోయాయి. బుజబల్‌తో పాటు దిలీప్ వాల్సే పాటిల్‌, ధర్మారావ్‌ ఆత్రాం, సునీల్‌ వాల్సడే, అదితి ఠాక్రే, హసన్‌ ముష్రీఫ్‌, ధనుంజయ్‌ ముండే, అనిల్‌పాటిల్‌ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. వీరికి రెండు రోజుల్లో శాఖలను కేటాయించనున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 40 మందిపైగా, ఆరుగురుకు మించి ఎమ్మెల్సీలు తమవైపు ఉన్నట్లు రాజ్‌ భవన్‌కు సమర్పించిన లేఖలో అజిత్‌ వర్గం పేర్కొంది. వాస్తవ సంఖ్య 43 అని తెలుస్తోంది. మొదట 36 మంది ఎమ్మెల్యేలు అజిత్‌తో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కాసేపటికే సంఖ్య 40 దాటడం గమనార్హం. ఇక బాఽధ్యతల స్వీకారం అనంతరం అజిత్‌ విలేకరుల సమావేశం నిర్వహించి తన నిర్ణయానికి అందరి మద్దతు, ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. ఆ సమయంలో శరద్‌ నమ్మినబంటు, కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రఫుల్‌ పటేల్‌ అజిత్‌తో ఉన్నారు.

Updated Date - 2023-07-03T14:39:32+05:30 IST