NCP chief : ఎన్‌సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామాపై కమిటీ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2023-05-05T13:35:49+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్ష పదవికి శరద్ పవార్ (Sharad Pawar) చేసిన రాజీనామాను ఆ పార్టీ శుక్రవారం
ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్ష పదవికి శరద్ పవార్ (Sharad Pawar) చేసిన రాజీనామాను ఆ పార్టీ శుక్రవారం తిరస్కరించింది. ఆయన స్థాపించిన పార్టీకి ఆయనే నాయకత్వం వహించాలని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయన రాజీనామా తర్వాత ఆయన వారసుని ఎంపిక కోసం ఏర్పాటైన కోర్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు. ఎన్‌సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ఈ సమావేశం వివరాలను మీడియాకు తెలిపారు.
ప్రఫుల్ పటేల్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్‌సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనే కోరికను శరద్ పవార్ వ్యక్తం చేశారన్నారు. ఆయన రాజీనామాను తాము ఏకాభిప్రాయంతో తిరస్కరించామని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఆయనను కోరాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన తర్వాత దేశంలోని అనేక పార్టీల నేతలు ఆయనను సంప్రదించారని తెలిపారు. ఆయన కుమార్తె సుప్రియ సూలేతోపాటు తాను కూడా తమ అభిప్రాయాలను ఆయనకు చెప్పామన్నారు. వివిధ జిల్లాల్లోని పార్టీ కేడర్ మనోభావాలను మనం చూస్తున్నామన్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు.
పార్టీ కేడర్ చాలా విచారంగా ఉన్నారని, వారి మనసు గాయపడిందని, తలక్రిందులయ్యారని చెప్పారు. ఈ విషయాలను మనం పట్టించుకోకుండా ఉండకూడదన్నారు. తమను విశ్వాసంలోకి తీసుకోకుండా పవార్ నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే బాధ్యతను తమకు ఆయన అప్పగించారని, తాము శుక్రవారం సమావేశమయ్యామని చెప్పారు. ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగాలని తామంతా ఏకగ్రీవంగా తీర్మానించామని చెప్పారు.
ఈ సమావేశంలో ఎన్‌సీపీ నేతలు అజిత్ పవార్, సుప్రియా సూలే పాల్గొన్నారు. ఈ కమిటీలో వీరితోపాటు సునీల్ టట్కరే, కేకే శర్మ, జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేశ్ టోపే, జితేంద్ర అవహద్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, జైదేవ్ గైక్వాడ్, నరహరి ఝీర్వాల్, ఎన్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఫౌజియా ఖాన్, యువజన విభాగం అధ్యక్షుడు ధీరజ్ శర్మ పాల్గొన్నారు.
ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ మంగళవారం రాజీనామా చేశారు. తదుపరి అధ్యక్షుడి ఎంపిక కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆయనకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే అజిత్ పవార్ ఆయన నిర్ణయాన్ని మొదట్లో స్వాగతించారు. శరద్ పవార్ మార్గదర్శకత్వంలో తదుపరి పార్టీ అధ్యక్షుడు పని చేస్తారని చెప్పారు.
స్టాలిన్ ట్వీట్
ఇదిలావుండగా, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఎన్‌సీపీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని శరద్ పవార్‌ను కోరారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయని, వీటి చుట్టూ జాతీయ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయని తెలిపారు. దేశంలోని అత్యున్నత స్థాయి నాయకుల్లో ఒకరైన శరద్ పవార్ లౌకికవాద కూటమిని బలోపేతం చేయడంలో కీలక నేత అని పేర్కొన్నారు. ఎన్‌సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనే ఆలోచనపై పునరాలోచించాలని, ఎన్‌సీపీ అధ్యక్షునిగా కొనసాగాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
Tipu Sultan : కేరళలో రాడికల్ జీహాదిజమ్ విత్తనాలు నాటినవాడు టిప్పు సుల్తాన్
Manipur Violence : మణిపూర్ హింసాకాండ వెనుక అసలు వాస్తవాలు