NDA, JDS: ఎన్డీఏ గూటికి జేడీఏస్.. మోదీతోనే నేరుగా ‘టచ్’లోకి దేవెగౌడ
ABN , First Publish Date - 2023-07-09T11:44:25+05:30 IST
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 19 స్థానాలు మాత్రమే సాధించి చతికిలపడ్డ జేడీఏలో జవసత్వాలు నింపేందుకు స్వయంగా పార్టీ జాతీయ అధ్య
- జోరుగా సాగుతున్న కసరత్తు
- లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చెట్టాల్ పట్టాల్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 19 స్థానాలు మాత్రమే సాధించి చతికిలపడ్డ జేడీఏలో జవసత్వాలు నింపేందుకు స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) రంగంలోకి దిగారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడంతోపాటు జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం చక్రం తిప్పేలా బహుముఖ వ్యూహానికి దళపతి పదును పెడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)తోనే నేరుగా దేవెగౌడ ‘టచ్’లో ఉన్నట్టు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా బీజేపీ, జేడీఎస్ నేతలు పరస్పరం ప్రశంసలు గుప్పించుకుంటూ ఉండడం ఇందుకు మరింత బలం చేకూరుతోంది. బీజేపీతో చేతులు కలిపితే మైనారిటీ ఓట్లు చేజారే ప్రమాదం ఉందని లోలోపల భయపడుతున్న జేడీఎస్(JDS) ఇందుకు కూడా తగిన వ్యూహాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదిరితే కనీసం 6 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, ఇందులో ఒక స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని దేవెగౌడ భావిస్తున్నట్టు సమాచారం. దేవెగౌడ కుటుంబం నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఈసారి పోటీ చేస్తారని, తద్వారా కుటుంబ పార్టీ అనే ముద్రను చెరిపేసుకునే ప్రయత్నాలు సాగుతున్నట్టు సూచనప్రాయంగా తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో మరిన్ని వివరాలను బయట పెట్టేందుకు ఇటు బీజేపీ నేతలుగానీ, అటు జేడీఎస్ నేతలుగానీ ఇష్టపడ్డం లేదు.
నిఖిల్ పోటీ ఖాయం
బీజేపీ, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ మండ్య లేదా హాసన్ నియోజక వర్గాల నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీతో సఖ్యతగా ఉంటున్న మండ్య స్వతంత్ర ఎంపీ, సినీనటి సుమలత ఈసారి బీజేపీ టికెట్‌పై మండ్య నుంచి బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. ఒకవేళ సుమలత విషయంలో బీజేపీలో ఏకాభిప్రాయం రాకపోతే నిఖిల్(Nikhil) పేరు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. హాసన్ నుంచి ఈసారి మాజీ ప్రధాని దేవెగౌడ పోటీ చేస్తారని వినిపిస్తోంది. బీజేపీతో పొత్తుతో గరిష్ఠంగా కనీసం నాలుగైదు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని జేడీఎస్ నేతలు భావిస్తున్నారు. జేడీఎస్ మద్దతుతో బీజేపీ కూడా తన సిట్టింగ్ స్థానాలను సాధ్యమైన మేరకు కాపాడుకోవాలని భావిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో తుమకూరు నుంచి పోటీ చేసిన దేవెగౌడ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్నారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీ 25 స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్, జేడీఎస్ తలా ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 15 స్థానాలను గెలిచి తీరాలని భావిస్తున్న కమలనాథులు జేడీఎస్ పొత్తుతోనే గట్టెక్కగలమని అంచనా వేస్తున్నారు. ఈ పొత్తు ఫార్ములా విజయవంతమైతే కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ అంశాన్ని గమనిస్తున్న కాంగ్రెస్ నేతలు కొద్దికాలంగా దేవెగౌడ కుమారుడు, మాజీ మంత్రి రేవణ్ణతో సన్నిహితంగా ఉంటుండడం గమనార్హం. ఇటీవల తన భార్య భవానికి అసెంబ్లీ టికెట్ నిరాకరించడంతో లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్న రేవణ్ణ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ తన కుమారుడు ప్రజ్వల్‌కు హాసన్ టికెట్ నిరాకరిస్తే రాజకీయంగా ఆ కుటుంబంలో పెనుదుమారం చెలరేగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీజేపీలో మేజర్ సర్జరీ
ఎన్డీయే గూటికి జేడీఎస్ చేరడం ఖాయమని వినిపిస్తున్న తరుణంలోనే బీజేపీ అధిష్టానం రాష్ట్ర బీజేపీలో మేజర్ సర్జరీ దిశగా భారీ కసరత్తు చేస్తోంది. ఈ కారణంగానే పలు కీలక తీర్మానాలను పెండింగ్‌లో ఉంచినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్రమంత్రి శోభాకరంద్లాజెకు పగ్గాలు అప్పగిస్తారని గట్టిగా వినిపిస్తోంది. ఇదే జరిగితే ఆమె కేంద్రమంత్రి పదవిని వదులుకునే అవకాశం ఉంది. దక్షిణాదిన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలను సైతం ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి అప్పగించిన సంగతి తెలిసిందే. శాసనసభ సమావేశాలు ప్రారంభమై వారం కావస్తున్నా ఇంతవరకు ఉభయసభల ప్రతిపక్షనేతల పేర్లను ఖరారు చేయలేదు. శాసనసభలో ప్రతిపక్షనేత పదవికి మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, సీనియర్ ఎమ్మెల్యే యత్నాళ్ మధ్య గట్టిపోటీ నెలకొని ఉంది. ఏక్షణంలోనైనా ఈ పదవుల భర్తీ జరుగుతుందని అనంతరం రాష్ట్ర బీజేపీలో భారీగా మార్పులు ఉంటాయని, పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.