Nirmala Sitharaman: ఆ పార్టీతో పొత్తు లేకుండా మనం నెగ్గడం కష్టమే..! బీజేపీ అధిష్ఠానానికి నిర్మలమ్మ నివేదిక?

ABN , First Publish Date - 2023-10-01T08:35:37+05:30 IST

కారణం ఏదైనా.. అన్నాడీఎంకే(AIADMK)ను దూరం చేసుకోవడం తమ పార్టీకి తీరని నష్టమేనని, ఆ పార్టీ లేకుండా తమిళనాట నెగ్గుకు రావడం కష్టమేనని

Nirmala Sitharaman: ఆ పార్టీతో పొత్తు లేకుండా మనం నెగ్గడం కష్టమే..! బీజేపీ అధిష్ఠానానికి నిర్మలమ్మ నివేదిక?

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కారణం ఏదైనా.. అన్నాడీఎంకే(AIADMK)ను దూరం చేసుకోవడం తమ పార్టీకి తీరని నష్టమేనని, ఆ పార్టీ లేకుండా తమిళనాట నెగ్గుకు రావడం కష్టమేనని బీజేసీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Union Finance Minister Nirmala Sitharaman) తమ అధిష్ఠానానికి నివేదించారు. అన్నాడీఎంకే తమకు దూరంగా జరగడంపై నివేదిక ఇవ్వాలంటూ అధిష్ఠానం ఆదేశాల మేరకు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలతో చర్చించిన నిర్మలమ్మ.. ఆ మేరకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ అన్నామలై ఒంటెత్తు పోకడలు, తమను అవమానించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు తమ కార్యకర్తలను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందంటూ అన్నాడీఎంకే... ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతుండగా, బీజేపీ నేతల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనైనా తమిళనాట బోణీ కొట్టాలనుకున్న తమ ఆశలు అడియాశలయ్యాలంటూ బీజేపీ నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ అధిష్ఠానం నిర్మలా సీతారామన్‌ను కోరినట్టు తెలిసింది. రెండు రోజుల పాటు రాష్ట్ర నేతలతో భేటీ అయిన ఆమె.. నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఎన్‌డీఏ కూటమిలో అన్నాడీఎంకే రెండో అతి పెద్ద పార్టీ అని, అలాంటి పార్టీని వదులుకోవడం వల్ల తమిళనాట తమకు నష్టమేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర విభాగం తొందరపాటు చర్యలతోనే అన్నాడీఎంకే దూరమైందని, ఇలా జరగకుండా ఉండాల్సిందని నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడినట్లు తెలిసింది. అయితే ఆదివారం అన్నామలైతో భేటీ కానున్న బీజేపీ అధిష్ఠానం.. ముందుగానే నిర్మలా సీతారామన్‌ నివేదిక తెప్పించుకోవడం గమనార్హం.

Updated Date - 2023-10-01T08:35:37+05:30 IST