Nitish Mamata Tejashwi: కోల్‌కతాలో కీలక భేటీ... ప్రతిపక్షాల ఐక్యత చాటే యత్నం

ABN , First Publish Date - 2023-04-24T15:23:35+05:30 IST

సమావేశానంతరం ముగ్గురూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని చర్చల అనంతరం నితీశ్ చెప్పారు.

Nitish Mamata Tejashwi: కోల్‌కతాలో కీలక భేటీ... ప్రతిపక్షాల ఐక్యత చాటే యత్నం
Nitish Kumar Tejashwi meets Mamata Banerjee in Kolkata

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM), జేడియూ అధినేత నితీశ్ కుమార్ (JDU chief Nitish Kumar), బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Bihar Deputy CM Tejashwi Yadav) టీఎంసీ(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో (Mamata Banerjee) కోల్‌కతాలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్షాల ఐక్యత చాటాలని నిర్ణయించారు. సమావేశానంతరం ముగ్గురూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని చర్చల అనంతరం నితీశ్ చెప్పారు. బీజేపీ పబ్లిసిటీ చేసుకోవడం తప్ప దేశాభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. విపక్ష నేతలంతా కలిసి కూర్చుని వ్యూహాలు రూపొందిస్తే బాగుంటుందని మమత చెప్పారు. బీజేపీని జీరో చేయడమే తమ లక్ష్యమన్నారు. బీహార్‌లోనే నాడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం ప్రారంభమైందని, ఇప్పుడు కూడా ప్రతిపక్షాలకు సంబంధించి అఖిల పక్ష సమావేశం బీహార్‌లో నిర్వహిస్తే బాగుంటుందని మమత సూచించారు.

బీహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడీ-జేడీయూ పొత్తులో సంకీర్ణ సర్కారు పాలన కొనసాగుతోంది. దీంతో నితీశ్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలు ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. అయితే చాలా పార్టీలు కాంగ్రెస్ నేతృత్వాన్ని ఇష్టపడటం లేదు. అంతెందుకు స్వయంగా మమత పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌కు దాదాపు ఉనికి లేకుండా చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గెలిచేసరికి బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌కు సహకరించడం వల్లే కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచారని, లోక్‌సభ ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌తో చేతులు కలపబోనని స్పష్టం చేశారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను (Samajwadi Party chief Akhilesh Yadav) కూడా నితీశ్ లక్నోలో కలుసుకోనున్నారు. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించనున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే విషయంలో అఖిలేష్ ఎలా స్పందిస్తారనేది నితీశ్‌తో సమావేశం తర్వాత తేలనుంది.

నితీశ్ ఏప్రిల్ 12న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను(Delhi Chief Minister Arvind Kejriwal) కలుసుకున్నారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు. కేంద్రంలో బలంగా ఉన్న నరేంద్ర మోదీ(PM Modi) సారథ్యంలోని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని నిలువరించాలంటే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చర్చించారు. ప్రతిపక్షాలు కలిసి కట్టుగా ఉంటూ కేంద్రం నుంచి మోదీ సర్కారును సాగనంపాలని నిర్ణయించినట్లు సమావేశానంతరం కేజ్రీవాల్, నితీశ్ చెప్పారు. అయితే ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే తాము 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రజలనే నిర్ణయించనీయాలని ఆప్ సూచించింది. కేజ్రీవాల్ మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి ధీటైన జాతీయ ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీదేనని కేజ్రీవాల్ విశ్వాసం. ఇదే విషయాన్ని ఆయన అనేక వేదికలపై ప్రకటించారు. ఇప్పటికే ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, గోవా, గుజరాత్‌లో ఉనికి చాటుకుని జాతీయ పార్టీ హోదా కూడా పొందింది. దీంతో నితీశ్ యత్నాలు నీరుగారిపోయినట్లైంది.

వాస్తవానికి ఏప్రిల్ 12న నితీశ్ బీహార్‌ కేజ్రీవాల్‌ను కలిసే ముందు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge) ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీరికి స్వాగతం పలికారు. అనంతరం అందరూ గ్రూప్ ఫొటోలు దిగారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించడంపై చర్చించారు. కాంగ్రెస్ అనుకూల పార్టీలతో పాటు కాంగ్రెసేతర పార్టీలను కూడా సంప్రదించాలని నిర్ణయించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరనేదానికన్నా, ప్రతిపక్షాలన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చర్చలు సాగాయి.

2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి నితీశేనని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. రాహుల్‌పై అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్ధి ఎవరనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వాన్ని ఇష్టపడని అనేక పార్టీలున్నాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే యూపిఏలో కొనసాగుతున్నారు. ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నాయి. స్టాలిన్ కూడా యూపిఏ భాగస్వామిగానే ఉన్నారు. బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ దాదాపు అన్ని కూటములకూ దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి స్పష్టమౌతుంది.

అంతకు ముందు అదానీ అంశం ప్రజాసమస్య కాదని, అదానీ (Adani) చేసిన మేలును కూడా గుర్తించాలంటూ ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలు అయోమయంలో పడిపోయాయి. అంతేకాదు ప్రధాని విద్యార్హత అంశం కూడా ప్రజా సమస్య కాదని పవార్ వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాల్లో ఐక్యత లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు కాంగ్రెస్ నేతలు వెనువెంటనే నితీశ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే 543 నియోజకవర్గాల్లోనూ ప్రతిపక్షాల తరపున ఒక్క అభ్యర్థే ఉండాలని నితీశ్ చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందని, బీజేపీ అభ్యర్థులను ఓడించడం సులభమౌతుందని నితీశ్ రాహుల్, ఖర్గేలకు వివరించారు.

నితీశ్ యత్నాలకు మమత సానుకూలంగా స్పందించడంతో ఇక అఖిలేష్ కూడా పాజిటివ్‌గా స్పందించడం ఖాయమని సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరడం దాదాపు అసాధ్యమే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో విపక్షాల ఐక్యతపై మరింత స్పష్టత రానుంది.

Updated Date - 2023-04-24T15:25:45+05:30 IST