No Confidence Motion : రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ దూబే ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-08T14:45:44+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మంగళవారం వాడివేడి చర్చ జరుగుతోంది. మణిపూర్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌ను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మంగళవారం వాడివేడి చర్చ జరుగుతోంది. మణిపూర్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌ను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. అనంతరం ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని జాబితాలో ఉన్నప్పటికీ, ఆయన కాకుండా ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. దీంతో నిశికాంత్ దూబే మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఈరోజు సిద్ధంగా లేరేమోనని ఎద్దేవా చేశారు. లేకపోతే ఆయన ఆలస్యంగా మేలుకుని ఉండి ఉంటారని వ్యాఖ్యానించారు. గౌరవ్ గొగోయ్ చాలా బాగా మాట్లాడారన్నారు. మణిపూర్‌లో కష్టకాలం వల్ల తాను బాధితుడినయ్యానని, తన అంకుల్ అక్కడ చాలా బాధలనుభవించారని, గాయపడ్డారని తెలిపారు. ఈ తీర్మానానికి అనుకూలంగా రాహుల్ గాంధీ మాట్లాడతారని భావించామన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన దూబే మాట్లాడుతూ, ‘‘నేను మీరు చెప్పినదానిని ఓపికతో విన్నాను. నా మాటలను కూడా మీరు వినాలి. దీని తర్వాత రాహుల్ గాంధీ ఇక మాట్లాడలేరు. మణిపూర్ గురించి చాలా చెప్పారు. ఈ తీర్మానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను’’ అన్నారు.
మోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇటీవల ఈ కేసులో క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయడంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగింది. దీంతో ఆయన సోమవారం నుంచి పార్లమెంటుకు హాజరవుతున్నారు.
దీనిని నిశికాంత్ దూబే ప్రస్తావిస్తూ, సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వలేదని, కేవలం క్రింది కోర్టు తీర్పును నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. తాను క్షమాపణ చెప్పబోనని, తాను సావర్కర్‌ను కాదని రాహుల్ అంటున్నారని, ఆయన ఎన్నటికీ స్వతంత్ర వీర్ సావర్కర్ కాజాలరని స్పష్టం చేశారు.
లోక్ సభ ఎన్నికల కోసం ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A)లో ఏ అక్షరం దేనిని సూచిస్తుందో కూడా ఆ కూటమిలోని ఎంపీలకు తెలియదన్నారు. I.N.D.I.A అంటే ఏమిటో చెప్పాలని సభలోని ఎంపీలను అడగండన్నారు. సోమవారంనాటి ప్రసంగంలో ‘న్యూస్ క్లిక్’ పేరును పునరుద్ధరిస్తే మీకొచ్చిన సమస్య ఏమిటి? అన్నారు. సీపీఎం మాజీ చీఫ్ ప్రకాశ్ కారత్ ఈ మీడియా సంస్థకు నిధులు ఇచ్చిన సింఘమ్‌కు అనేక ఈ-మెయిల్స్ పంపించారని, కావాలంటే తాను ఆధారాలు చూపిస్తానని తెలిపారు. సీపీఎం దేశ వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు.
మెజారిటీ వర్సెస్ మైనారిటీ : డీఎంకే
అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ, మణిపూర్ పరిణామాలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేకపోవడాన్ని యూరోపియన్ పార్లమెంటు, బ్రిటిష్ పార్లమెంటు ఖండించాయన్నారు. ఘర్షణల్లో 163 మంది మరణించినప్పటికీ మోదీ మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దేశంలో మాదిరిగానే మణిపూర్‌లో కూడా మెజారిటీ వర్సెస్ మైనారిటీ వ్యవహారం జరుగుతోందన్నారు. చాలా దూకుడుతనాన్ని ప్రదర్శించే మోదీ ఇప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు. ఆయన పార్లమెంటుకు రావడం కోసం ప్రజలు ఆయనను ఎన్నుకున్నారని, ఆయనను వెనుకకు లాగుతున్నదేమిటని ప్రశ్నించారు.
‘హృదయం లేని ప్రభుత్వం’
టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ, నిషేధిత బీబీసీ డాక్యుమెంటరీ గురించి కానీ, గుజరాత్ అల్లర్ల గురించి కానీ తాను మాట్లాడటం లేదన్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ రాష్ట్రానికి రూ.7,300 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిందన్నారు. ఇది హృదయం లేని ప్రభుత్వమని తెలిపారు. బెంగాల్‌కు బీజేపీ ప్రతినిధి బృందాలను పంపించారని, మణిపూర్ రాష్ట్రానికి కనీసం ఒక ప్రతినిధి బృందాన్ని అయినా పంపించలేదని అన్నారు. భారత దేశాన్ని ప్రేమించేవారు సహజంగానే మోదీని వ్యతిరేకిస్తారని చెప్పారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తన ప్రసంగంలో కనీసం ఒకసారి అయినా మణిపూర్ గురించి మాట్లాడలేదన్నారు.
అచ్ఛే దిన్ ఎక్కడ?
ఎన్‌సీపీ ఎంపీ సుప్రియ సూలే మాట్లాడుతూ, దేశంలో ద్రవ్యోల్బణం, మణిపూర్ హింసాత్మక ఘర్షణలను ప్రస్తావించారు. బీజేపీ హామీ ఇచ్చిన ‘‘మంచి రోజులు’’ ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేంద్ర సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
Delhi Service Bill : ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణలు.. కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి..