Road Accident: ఒకరు మృతి, 24 మందికి గాయాలు.. పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Dec 27 , 2023 | 11:10 AM
పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆరు వాహనాలు ఒకదాంతో ఒకటి ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి.
లక్నో: పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆరు వాహనాలు ఒకదాంతో ఒకటి ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమయంగా ఉంది. పొగమంచు కారణంగా మొదట ఓ డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బస్సు వెనుక వస్తున్న ఇతర వాహనాలు కూడా దారి కనిపించక డబుల్ డెక్కర్ బస్సును ఢీకొన్నాయి. అలా ఆరు వాహనాలు ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి గురైన వాహనాలు ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. అంతేకాకుండా సదరు వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో బస్సులోని ఓ ప్రయాణికుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 24 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షత్రగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. కాగా ఉత్తర భారతదేశాన్ని చలి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అనేక చోట్ల దృశ్యమానత సున్నాకు పడిపోయింది.