Congress Vs BJP : ‘రెడ్ డైరీ’లో కాంగ్రెస్ చీకటి రహస్యాలు : మోదీ
ABN , First Publish Date - 2023-07-27T14:50:37+05:30 IST
రాజస్థాన్ శాసన సభ ఎన్నికల రణ రంగంలో శంఖారావాల మోత ప్రారంభమైంది. అధికార పక్షం కాంగ్రెస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపణలు పదును తేలుతున్నాయి. సికర్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)పై ఘాటైన విమర్శలు చేశారు.
జైపూర్ : రాజస్థాన్ శాసన సభ ఎన్నికల రణ రంగంలో శంఖారావాల మోత ప్రారంభమైంది. అధికార పక్షం కాంగ్రెస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపణలు పదును తేలుతున్నాయి. సికర్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)పై ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ చీకటి రహస్యాలను రెడ్ డైరీ బయటపెడుతుందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చీకటి వ్యవహారాల రికార్డులు ఈ రెడ్ డైరీలో ఉన్నాయని అంటున్నారని, దీనిలోని పేజీలను తెరిస్తే, చాలా ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారని తెలిపారు. ‘రెడ్ డైరీ’ గురించి ప్రస్తావించడంతో కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నేతలు మౌనం దాల్చారని దుయ్యబట్టారు. దీని గురించి మాట్లాడకుండా పెదవులను కుట్టేసుకున్నా, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగలబోతోందని చెప్పారు. కాంగ్రెస్ ‘అబద్ధాల దుకాణం’లో ‘రెడ్ డైరీ’ తాజా ప్రాజెక్టు అని ఎండగట్టారు.
రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందని మోదీ దుయ్యబట్టారు. నేడు రాజస్థాన్‌లో ఒకే ఒక నినాదం మారుమోగుతోందని, అది ‘కమలం విజయం సాధిస్తుంది - కమలం వికసిస్తుంది’ అని చెప్పారు. రాష్ట్ర ప్రజలు తాగు నీటి కోసం అలమటించేలా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఆడ బిడ్డలపై దురాగతాలను రాజస్థాన్ సహించబోదన్నారు.
‘గెహ్లాట్ కాలి గాయం నయమవాలి’
అశోక్ గెహ్లాట్ కాలికి గాయం అయినందువల్ల ఆయన ఈ సభలో పాల్గొనలేకపోయారని, ఆయన గాయం త్వరగా నయమవాలని, ఆయన ఆరోగ్యవంతులు కావాలని మోదీ ఆకాంక్షించారు.
అభివృద్ధి కార్యక్రమాలు
మోదీ గురువారం రాజస్థాన్‌లోని సికర్‌లో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను, అదేవిధంగా ఐదు నూతన వైద్య కళాశాలలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లు ఇచ్చిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు.
అశోక్ గెహ్లాట్ స్పందన
మోదీ చేసిన ‘రెడ్ డైరీ’ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు. ప్రధాన మంత్రి పదవికి ఔన్నత్యం, హుందాతనం ఉన్నాయన్నారు. ప్రజలు మోదీకి రానున్న రోజుల్లో ఎర్ర జెండా చూపిస్తారన్నారు. మోదీ, బీజేపీ నేతలు తమను చూసి భయపడుతున్నారన్నారు. రాజేంద్ర గుఢాను వారు బలి పశువును చేశారన్నారు. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. ‘రెడ్ డైరీ’ అనేది కల్పిత కథ అని చెప్పారు. అలాంటి డైరీ ఏదీ లేదన్నారు. దేశంలో ఇంధనం ధరలు పెరుగుతున్న దృష్ట్యా రెడ్ సిలిండర్ (వంట గ్యాస్ సిలిండర్) గురించి ఆలోచించాలని సలహా ఇచ్చారు.
ఏమిటి ఈ రెడ్ డైరీ?
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గూఢా ఆదివారం ‘రెడ్ డైరీ’ అంటూ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అశోక్ గెహ్లాట్‌ను ఇబ్బందుల నుంచి తాను కాపాడానని, కానీ తనను ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారని, వివరణ ఇచ్చే అవకాశాన్ని తనకు ఇవ్వలేదని అన్నారు. ‘‘రాజేంద్ర గూఢా లేకపోయి ఉంటే, ముఖ్యమంత్రి జైల్లో ఉండేవారు’’ అని రాజేంద్ర చెప్పారు. కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినపుడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశాల మేరకు తాను ‘రెడ్ డైరీ’ని స్వాధీనం చేసుకున్నానని చెప్పారు. ఆ డైరీలో ఏం ఉందో చెప్పకుండానే, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకోవాలని గెహ్లాట్ తనకు చెప్పారన్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దురాగతాలను లేవనెత్తడంతో రాజేంద్ర గూఢాను మంత్రి పదవి నుంచి గెహ్లాట్ తొలగించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
No-confidence motion : నలుపు రంగు దుస్తులతో పార్లమెంటుకు ఇండియా కూటమి ఎంపీలు
I.N.D.I.A : మణిపూర్ సందర్శనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి