Narendra Modi: నేడు ప్రధాని మోదీ-సౌదీ అరేబియా యువరాజు సమావేశం.. చర్చించే అంశాలివే!

ABN , First Publish Date - 2023-09-11T10:56:15+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో గల హైదరాబాద్ హౌస్‌లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సమావేశం కానున్నారు.

Narendra Modi: నేడు ప్రధాని మోదీ-సౌదీ అరేబియా యువరాజు సమావేశం.. చర్చించే అంశాలివే!

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గల హైదరాబాద్ హౌస్‌లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెండు దేశాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాల్లో భాగంగా 3 రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. జీ20 సమావేశాలు ముగియడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య రాజకీయ, భద్రత, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతితో సహా పలు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాలను ఇద్దరు నేతలు చర్చిస్తారు. వ్యూహాత్మక భాగస్వామ్య మండలిలోని రాజకీయ, భద్రత, సామాజిక, సాంస్కృతిక సహకార కమిటీ, ఆర్థిక, పెట్టుబడుల సహకార కమిటీ అనే రెండు మంత్రుల కమిటీల పురోగతిని నాయకులు అంచనా వేస్తారు. వీటితోపాటు ఇద్దరు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా చర్చిస్తారని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాల్లో ప్రతిష్టాత్మక ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్‌పై సౌదీ అరేబియా కూడా సంతకం చేసింది.


ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మహ్మద్ బిన్ సల్మాన్ సమావేశమవుతారు. ఆ సమావేశం అనంతరం రాత్రి 8:30 గంటలకు స్వదేశానికి తిరిగి వెళ్తారు. 2019 రియాద్ పర్యటనలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశం, సౌదీ అరేబియా రక్షణ సహకారంపై జాయింట్ కమిటీ (JCDC) క్రమం తప్పకుండా సమావేశమవుతాయని తెలిపారు. రెండు దేశాలు రక్షణ రంగంలో పరస్పర ఆసక్తి, సహకారానికి సంబంధించిన అనేక అంశాలను గుర్తించాయని ఆయన చెప్పారు. కాగా భారత్, సౌదీ అరేబియా వ్యాపారంలో మంచి భాగస్వాములు. సౌదీ అరేబియాకు భారత్ రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి కాగా.. భారత్‌కు సౌదీ అరేబియా నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. సౌదీ అరేబియా నుంచి భారతదేశం భారీగా చమురును దిగుమతి చేసుకుంటుండడంతో రెండు దేశాలు ఇంధన రంగంలో బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 52.75 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.

Updated Date - 2023-09-11T11:02:47+05:30 IST