Karnataka Polls : సిద్ధరామయ్యను నిలదీయండి.. ప్రజలకు మోదీ పిలుపు..

ABN , First Publish Date - 2023-05-06T17:52:43+05:30 IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం

Karnataka Polls : సిద్ధరామయ్యను నిలదీయండి.. ప్రజలకు మోదీ పిలుపు..
Sidharamaiah, Narendra Modi

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శనివారం విరుచుకుపడ్డారు. శాసన సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) తరపున ప్రచారం చేస్తున్న మోదీ బాదామి నియోజకవర్గంలో మాట్లాడుతూ, ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధరామయ్య ఈ ఎన్నికల్లో ఈ స్థానాన్ని ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభంజనం గురించి ఆయన అర్థం చేసుకున్నారని, అందుకే ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టారని వ్యాఖ్యానించారు.

ఈ ప్రాంతంలోని పేద ప్రజలు అన్ని రకాల సదుపాయాలను ఎందుకు కోల్పోయారో చెప్పాలని సిద్ధరామయ్య (Siddaramaiah)ను అడగాలని ప్రజలను మోదీ కోరారు. ‘‘సిద్ధరామయ్య ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోయారు. ఎందుకంటే ఆయనకు ప్రభంజనం ఎటు వీస్తోందో అర్థమైపోయింది’’ అని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల వల్ల బాగల్‌కోట్ జిల్లాలో దాదాపు 3 లక్షల కుటుంబాలకు మొట్టమొదటిసారి కొళాయి నీటి సదుపాయం వచ్చిందన్నారు. ‘‘మీ ప్రాంతంలో పోటీ చేసినా ఫలితం దక్కదని సిద్ధరామయ్య అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన మీకు ఎప్పుడైనా తారసపడితే, ఈ ప్రాంత ప్రజలు గతంలో ప్రాథమిక సదుపాయాలకు ఎందుకు నోచుకోలేదని ఆయనను అడగండి’’ అని మోదీ చెప్పారు. ఈ ప్రాంత ప్రజల జీవితాలు ఎందుకు మారలేదని, ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించాలని కోరారు. ప్రజల కోసం బీజేపీ (BJP) ఎంతో చేసిందని, దీనిని కాంగ్రెస్ (Congress) కనీసం ఊహించలేకపోయిందని చెప్పారు.

2018లో జరిగిన కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో సిద్ధరామయ్య బాదామి నియోజకవర్గం నుంచి గెలిచారు. బీజేపీ అభ్యర్థి బీ శ్రీరాములుపై 1,696 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కానీ ఆయన పోటీ చేసిన రెండో నియోజకవర్గం చాముండేశ్వరిలో ఆయనకు పరాజయం ఎదురైంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన వరుణ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఆయన కుమారుడు యతీంద్ర ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆయన కోలార్‌లో కూడా పోటీ చేయాలని ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు.

సిద్ధరామయ్య గత నెలలో మాట్లాడుతూ, వరుణ శాసన సభ నియోజకవర్గం పరిధిలోనే తన స్వగ్రామం ఉందని చెప్పారు. తన జీవితంలో ఇవే చివరి ఎన్నికలని, తాను ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించారు.

224 శాసన సభ స్థానాలున్న కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది.

ఇవి కూడా చదవండి :

Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీంను రప్పించే ప్రయత్నాలు సాగేది ఇంకెంత కాలం?

Bajrang Dal Ban : హిందూ సంస్థలపై నిషేధాలు.. భావోద్వేగ రాజకీయాలు..

Updated Date - 2023-05-06T17:52:43+05:30 IST