Karnataka Assembly Election Results : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై మోదీ ట్వీట్

ABN , First Publish Date - 2023-05-13T18:28:01+05:30 IST

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందించారు.

Karnataka Assembly Election Results : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై మోదీ ట్వీట్
Narendra Modi

న్యూఢిల్లీ : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విజయం సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. రానున్న కాలంలో మరింత ఉత్సాహంగా కర్ణాటకకు సేవ చేస్తామని తెలిపారు.

రాహుల్ యాత్ర ప్రభావం : జైరామ్ రమేశ్

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెనుక భారత్ జోడో యాత్ర ప్రభావం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఈ యాత్ర ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తుండగా, పార్టీని ఏకతాటిపై నడిపించడం, కేడర్‌ను ఉత్సాహపరచడం, కర్ణాటక ఎన్నికల కోసం ఓ కథనానికి రూపునివ్వడం పరోక్షంగా కనిపిస్తోందని తెలిపారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ కర్ణాటకలో అనేక మందితో మాట్లాడారని చెప్పారు. ప్రజల మాటలకు అనుగుణంగా తమ మేనిఫెస్టోను రూపొందించామన్నారు.

బీజేపీకి ఝలక్ ఇచ్చిన లింగాయత్‌లు

కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యంగల నియోజకవర్గాలు 69 ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్‌కు అంతకుముందు కన్నా 24 స్థానాలు ఎక్కువగా లభించాయి. అంటే ఈసారి 46 స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. బీజేపీకి 22 స్థానాలు తగ్గిపోయాయి. అంటే ఈసారి ఆ పార్టీకి 19 స్థానాలు మాత్రమే లభించాయి. జేడీఎస్‌కు కూడా అంతకుముందు కన్నా మూడు స్థానాలు తగ్గిపోయి, రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో ఇతరులు ఒక స్థానంలోనే గెలవగా, ఇప్పుడు ఇద్దరు గెలిచారు.

51 స్థానాల్లో వొక్కళిగల ప్రాబల్యం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు కన్నా 12 స్థానాలు ఎక్కువగా లభించాయి. అంటే ఈసారి 27 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ మూడు స్థానాలను కోల్పోయి, 10 స్థానాలతో సరిపెట్టుకుంది. జేడీఎస్ 11 స్థానాలను కోల్పోయి, 12 స్థానాల్లో గెలిచింది. ఇతరులు ఇద్దరు గెలిచారు.

ఓటమికి నాదే బాధ్యత : బొమ్మయ్

కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ఓటమికి బాధ్యత తనదేనని చెప్పారు. తమ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. పార్టీని పటిష్టపరచి, రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతామని చెప్పారు.

వాగ్దానాలను నెరవేర్చుతాం : డీకే

డీకే శివ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతామని చెప్పారు. ఇది ఎంతో శ్రమించి సంపాదించిన విజయమని తెలిపారు.

సంబరాల సమయం : శశి థరూర్

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇచ్చిన ట్వీట్‌లో, ఇది సంబరాల సమయమని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ సహచరులను చూసి గర్వపడుతున్నానని తెలిపారు. స్థానిక సమస్యలపై వారు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు. పోలరైజేషన్ రాజకీయాలను నిరోధించేందుకు నిబద్ధతతో కృషి చేశారన్నారు. కృషికి తగిన ఫలితం దక్కిందన్నారు.

ఇవి కూడా చదవండి :

JDS KumaraSwamy: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!

DK Shivakumar: భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే

Updated Date - 2023-05-13T18:28:01+05:30 IST