Meghalaya Assembly elections : కమలం వికసిస్తుందనేది ప్రజల మాట : మోదీ
ABN , First Publish Date - 2023-02-24T16:21:34+05:30 IST
మేఘాలయలో అంతటా బీజేపీ (BJP) ఉందన్నారు. ‘‘మోదీ, మీ కమలం వికసిస్తుంది’’ అని ప్రజలు చెప్తున్నారన్నారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వ్యవహార శైలి, ప్రయోగిస్తున్న పదజాలంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుక్రవారం విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ప్రజలే దీటైన సమాధానం చెబుతారన్నారు. మేఘాలయ శాసన సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు.
మేఘాలయలో అంతటా బీజేపీ (BJP) ఉందన్నారు. ‘‘మోదీ, మీ కమలం వికసిస్తుంది’’ అని ప్రజలు చెప్తున్నారన్నారు. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు మాత్రం ‘‘మోదీ, నీ సమాధి నిర్మాణం జరుగుతుంది’’ అని అంటున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera)ను ఢిల్లీ విమానాశ్రయం (Delhi airport)లో అస్సాం పోలీసులు గురువారం అరెస్టు చేసినపుడు ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ‘‘నియంతృత్వం సాగబోదు, మోదీ, నీ సమాధి నిర్మాణం జరుగుతుంది’’ అని నినాదాలు చేశారు. దీనిని మోదీ శుక్రవారం పరోక్షంగా ప్రస్తావించారు. దురాలోచనగలవారికి, దుష్ట పదజాలాన్ని వాడేవారికి ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. మేఘాలయలో అన్ని చోట్ల బీజేపీ కనిపిస్తోందన్నారు. కొండ ప్రాంతాలు, మైదానాలు, గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోట బీజేపీ ఉందన్నారు. కమలం (బీజేపీ ఎన్నికల గుర్తు) వికసిస్తోందన్నారు. దేశ ప్రజల తిరస్కరణకు గురైనవారు ‘‘మోదీ, నీ సమాధి నిర్మాణం జరుగుతుంది’’ అని అంటున్నారని దుయ్యబట్టారు. అయితే ప్రజలు మాత్రం ‘‘మోదీ, మీ కమలం వికసిస్తుంది’’ అని చెప్తున్నారన్నారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఇటీవల ముంబైలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిందని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నరేంద్ర గౌతమ్ దాస్ మోదీ అని పేర్కొన్నారు. మోదీ తండ్రి పేరు దామోదర్ దాస్ మోదీ కాగా, గౌతమ్ దాస్ అని చెప్పడాన్ని బీజేపీ నేతలు ఖండించారు. ఆయనపై కేసులు పెట్టారు. అస్సాంలో నమోదైన కేసులో ఖేరాను పోలీసులు అరెస్టు చేశారు.
మేఘాలయ శాసన సభ ఎన్నికలు ఈ నెల 27న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
Congress Plenary : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికలపై సంచలన నిర్ణయం
Khalistan : మా లక్ష్యం చెడ్డది కాదు : అమృత్ పాల్ సింగ్