Sharad Pawar and Narendra Modi : శరద్ పవార్ ప్రధాన మంత్రి ఆకాంక్షలపై మోదీ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-09T10:27:49+05:30 IST
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. అనేక మంది గొప్ప నేతల ఆకాంక్షలను కాంగ్రెస్ చంపేసిందని దుయ్యబట్టారు. ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటివారికి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించే శక్తి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వారు ఆ పదవిని చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్, మహారాష్ట్రలలోని ఎన్డీయే ఎంపీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ఎన్డీయేను సమాయత్తం చేయడం కోసం మోదీ ఆ కూటమిలోని ఎంపీలను కొన్ని బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందంతో ఒక్కొక్క రోజు సమావేశమవుతున్నారు. ఆయన మంగళవారం రాజస్థాన్, మహారాష్ట్ర ఎన్డీయే ఎంపీల బృందంతో సమావేశమయ్యారు.
వారసత్వ రాజకీయాలపై మోదీ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుని, ఆ స్ఫూర్తితో దేశాన్ని అవినీతి, బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాను పదవిలో ఉన్నప్పటికీ, తప్పు చేసినవారికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్నడూ వెనుకడుగు వేయలేదన్నారు. చాలా సందర్భాల్లో అలాంటివారికి ఉన్న బాధ్యతలను, పదవులను తొలగించామని, ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లను నిరాకరించామని చెప్పారు.
రాజస్థాన్‌లో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీని గురించి మోదీ మాట్లాడుతూ, రాజస్థాన్‌లో ప్రస్తుతం అంతా అస్తవ్యస్తంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా గెలవాలన్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర నేతలు కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు.
శరద్ పవార్ గొప్ప అనుభవశాలి
మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ 1991 జూన్ నుంచి 1993 మార్చి వరకు అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా పని చేశారు. సోనియా గాంధీ విదేశీ మూలాలుగల వ్యక్తి అని చెప్తూ, కాంగ్రెస్ నుంచి ఆయన 1999లో వైదొలగారు. అనంతరం ఎన్‌సీపీని స్థాపించారు. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేలో 2004లో చేరారు. 2014 వరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తుల్లో కీలక నేతగా ఆయనకు పేరుంది.
ఇవి కూడా చదవండి :
Manmohan: వీల్‌చైర్‌పై పార్లమెంటుకు మన్మోహన్.. బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం..!
Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..