Sanjay Raut: అదే జరిగితే... వారణాసిలో మోదీ ఓటమి ఖాయం..!

ABN , First Publish Date - 2023-08-14T15:53:38+05:30 IST

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి నుంచి ఆయనపై ప్రియాంక పోటీ చేస్తే ఆమె గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు.

Sanjay Raut: అదే జరిగితే... వారణాసిలో మోదీ ఓటమి ఖాయం..!

ముంబై: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి (Varanasi) నుంచి ఆయనపై ప్రియాంక పోటీ చేస్తే ఆమె గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు. వారణాసి ప్రజలు ప్రియాంకను కోరుకుంటున్నారని, ఆమె కనుక ప్రధానిపై వారణాసి నుంచి పోటీ చేస్తే గెలుపు ఆమెనే వరిస్తుందని అన్నారు. ఈసారి రాయబరేలి, వారణాసి, అమేథిలో బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటుందని చెప్పారు.


పవార్ ద్వయం ఎందుకు కలుసుకోకూడదు?

ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్, ఆయన మేనల్లుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇటీవల సమావేశం కావడంపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌షరీప్, నరేంద్ర మోదీ కలుసుకున్నప్పుడు శరద్ పవార్, అజిత్ పవార్ ఎందుకు కలుసుకోకూడదని ప్రశ్నించారు. వారిద్దరూ సమావేశమైన విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని, బహుశా విపక్ష కూటమి I.N.D.I.A. సమావేశానికి రావాలని అజిత్‌ పవార్‌ను శరద్ పవార్ ఆహ్వానించి ఉండవచ్చని అన్నారు. మహారాష్ట్రలోని ప్రస్తుత ప్రభుత్వంపై ఇద్దరు డిప్యూటీ సీఎంలు సంతోషంగా లేరని కూడా రౌత్ వ్యాఖ్యానించారు.


ప్రియాంక ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీ ఇష్టం: వాద్రా

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ, ప్రియాంక పార్లమెంటులో అడుగుపెట్టాలని తాను అనుకుంటున్నానని, ఆమె లోక్‌సభలో అడుగుపెట్టాలని ప్రజలు కూడా కోరుకుంటే అది జరుగుతుందని అన్నారు. అమేథీ నుంచి పోటీ చేస్తారా సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తారా అనేది పార్టీ నిర్ణయించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2023-08-14T15:53:38+05:30 IST