Congress MLA Arrest: డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

ABN , First Publish Date - 2023-09-28T12:22:17+05:30 IST

డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున చండీగఢ్‌లోని ఖైరా నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Congress MLA Arrest: డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

చండీగఢ్: డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున చండీగఢ్‌లోని ఖైరా నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జలాలాబాద్, ఫజిల్కాలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద 2015లో నమోదైన పాత కేసుకు సంబంధించి పోలీసులు ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాకు మద్దతు ఇవ్వడం, వారికి ఆశ్రయం కల్పించడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం వంటి ప్రాథమిక ఆరోపణలు ఖైరాపై ఉన్నాయి. దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ ప్రకారం.. వచ్చిన నిధులను ఖైరా ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2014-2020 మధ్య ఎన్నికల సమయలో ఖైరా ప్రకటించిన ఆదాయానికి మించి కుటుంబసభ్యులకు రూ.6.5 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు నివేదికలున్నాయి.


అయితే పోలీసీులు తన ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఖైరా ఫేస్‌బుక్ లైవ్ ఏర్పాటుచేశారు. పోలీసులు అతని వద్దకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఫేస్‌బుక్ లైవ్‌ను నిర్వహిస్తున్నారు. ఆ వీడియోలో ఖైరా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అరెస్టు చేస్తాన్నారంటూ నిలదీశారు. పాత డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో సిట్ ఏర్పాటు చేసినట్లు ఖైరాకు పోలీసు అధికారి, డీఎస్పీ అచ్రు రామ్ శర్మ చెప్పడం వీడియోలో చూడవచ్చు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే సమయంలో "పంజాబ్ సర్కార్ ముర్దాబాద్" అంటూ ఖైరా నినాదాలు చేయండం వీడియోలో కనిపించింది. కుటుంబసభ్యులు అడ్డుకున్నప్పటికీ ఖైరాను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు జలాలాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఇటీవల ప్రతిపక్షాలంతా కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో పంజాబ్‌లోని అధికార పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం ఇండియా కూటమిని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే పంజాబ్‌లో ఆప్‌తో పొత్తు లేదా సీట్ల పంపకాలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వ్యతిరేకించింది.

Updated Date - 2023-09-28T12:28:08+05:30 IST