Cambridge speech : కేంబ్రిడ్జ్ ప్రసంగంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-03-03T15:22:01+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) పిలుపునిచ్చారు.
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక మౌలిక నిర్మాణాన్ని, దాని పరిధిని తగ్గించకూడదని తెలిపారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ (Cambridge Judge Business School)లో ‘21వ శతాబ్దంలో వినడాన్ని నేర్చుకోవడం’ (Learning to Listen in the 21st Century)పై ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలోని ఐదు ముఖ్యాంశాలు ఏమిటంటే...
1. తనతోపాటు అనేక మంది రాజకీయ నేతలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్ (Israeli spyware Pegasus)ను భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందని రాహుల్ చెప్పారు. ఫోన్‌లో మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనకు చెప్పారన్నారు.
2. భారతీయ ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందన్నారు. సమంజసం కానటువంటి క్రిమినల్ కేసుల భయం ప్రతిపక్ష నేతలను వెంటాడుతోందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రాథమికాంశాలైన పార్లమెంటు, స్వేచ్ఛాయుత పత్రికా రంగం, న్యాయ వ్యవస్థ ఆంక్షలను ఎదుర్కొంటున్నాయన్నారు.
3. భారత్ జోడో యాత్రను గుర్తు చేసుకుంటూ, వినడం, అహింస చాలా శక్తిమంతమైనవని చెప్పారు. జమ్మూ-కశ్మీరులో ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి, ‘‘మీరు నిజంగా కశ్మీరు లోయలోని ప్రజల అభిప్రాయాలను వినడానికే వచ్చారా?’’ అని ప్రశ్నించారని చెప్పారు. ఆ వ్యక్తి అక్కడికి సమీపంలో ఉన్న ‘మిలిటెంట్ల’ను చూపిస్తూ ఈ విధంగా ప్రశ్నించారన్నారు. ‘‘నేను వాళ్లవైపు చూశాను. నేను ఇబ్బందుల్లో పడ్డాననుకున్నాను. అయితే ఏమీ జరగలేదు. మేం అలా యాత్ర కొనసాగించాం. ఏదైనా చేయాలనుకున్నా, చేయగలిగే శక్తి వారికి లేదు. ఎందుకంటే, నాలో ఎటువంటి హింసలేకుండా, వినడానికే నేను అక్కడికి వెళ్లాను’’ అన్నారు.
4. రెండో ప్రపంచ యుద్ధం, 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలడం వంటి సంఘటనల తర్వాత అమెరికా, చైనా సిద్ధాంతాల్లో వైరుద్ధ్యాల గురించి ఆయన ప్రస్తావించారు. చైనాలో ఉత్పత్తి పెరిగిందని, భారత దేశం, అమెరికా వంటి దేశాల్లో తయారీ రంగం క్షీణించిందని చెప్పారు. అసమానతలు, ఆగ్రహాలను అత్యవసరంగా పరిష్కరించాలన్నారు.
5. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చుట్టూ ఉన్న వ్యవస్థ ద్వారా సామరస్యాన్ని చైనా గౌరవిస్తుందన్నారు. చైనా విద్యుత్తు, ఇంధనం, ప్రాసెసెస్, ఫ్లోలపై దృష్టి పెట్టి, వాటికి ఓ రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తుందన్నారు. దీనిని పరిశీలిస్తే, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ఏమిటో తెలుస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి :
Karnataka : ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో అంత డబ్బా!?