Rahul Gandhi : ప్రజల సహకారం చూసి కన్నీళ్లు పెట్టుకున్నా..

ABN , First Publish Date - 2023-01-30T14:52:18+05:30 IST

భారత్ జోడో యాత్ర ముగిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభను నేడు శ్రీనగర్‌లో నిర్వహించారు.

Rahul Gandhi : ప్రజల సహకారం చూసి కన్నీళ్లు పెట్టుకున్నా..

శ్రీనగర్ : భారత్ జోడో యాత్ర ముగిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభను నేడు శ్రీనగర్‌లో నిర్వహించారు. అక్కడ తన సోదరి ప్రియాంకతో కలిసి మంచులో ఆటలాడుతూ రాహుల్ చాలా సందడిగా గడిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 145 రోజుల పాటు జోడో యాత్ర సాగింది. భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందన్నారు.

కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తాం..

జోడో యాత్ర ఊహించిన దానికంటే విజయవంతమైందన్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నారు. జోడో యాత్ర నాకెన్నో పాఠాలు నేర్పిందన్నారు. ప్రజల సహకారం చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని రాహుల్ పేర్కొన్నారు. ప్రజల సహకారం లేనిది ఏ పని ముందుకు సాగదన్నారు. కశ్మీర్ ప్రజలకు దేశమంతా అండగా ఉందన్నారు. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

మిలే కదం.. జుడే వతన్‌..

గత ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ పాదయాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. సుమారు 5 నెలలపాటు 4 వేల కి.మీ మేర ఈ యాత్ర కొనసాగింది. ఇక జనవరి 30న కశ్మీర్‌లో ముగింపు సభ జరిగింది. ‘మిలే కదం.. జుడే వతన్‌ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో ఈ యాత్ర ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర సాగింది. అడుగడునా రాహుల్‌కు ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది. 145 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది.

రాహుల్ టీ షర్ట్‌పై విమర్శలు..

సుమారు ఐదు నెలలపాటు కొనసాగిన పాదయాత్రలో వివాదాలకు కొదువేం లేదు. చివరికి ఆయన ధరించిన టీ షర్ట్ కూడా వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ రూ.41వేల విలువచేసే టీ షర్టుపై యాత్ర ఆరంభంలోనే భాజపా తీవ్ర విమర్శలు చేసింది. వీర్‌ సావర్కర్‌, కొవిడ్‌ నిబంధనలు వంటి అంశాలన్నీ చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఈ పాదయాత్రలో రాహుల్‌ పెళ్లిపై ఎన్నోసార్లు ప్రశ్నలు సైతం తలెత్తాయి. అన్నిటికీ చాలా సరదాగా సమాధానాలిస్తూ వెళ్లారు. మొత్తానికి రాహుల్ పాదయాత్ర ఆయనకు మంచి మైలైజ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

Updated Date - 2023-01-30T14:52:26+05:30 IST