Manipur : మణిపూర్‌పై రాహుల్ గాంధీ వీడియో సందేశం.. మోదీపై తీవ్ర విమర్శలు..
ABN , First Publish Date - 2023-07-27T16:32:17+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) గురువారం తీవ్ర విమర్శలు గుప్పించారు. తన భావజాలమే మణిపూర్‌ను తగులబెడుతోందని ఆయనకు బాగా తెలుసునని, అందుకే ఆయన నోరు విప్పడం లేదని ఆరోపించారు.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) గురువారం తీవ్ర విమర్శలు గుప్పించారు. తన భావజాలమే మణిపూర్‌ను తగులబెడుతోందని ఆయనకు బాగా తెలుసునని, అందుకే ఆయన నోరు విప్పడం లేదని ఆరోపించారు. మోదీ కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ప్రధాన మంత్రి అని దుయ్యబట్టారు. మణిపూర్ మహిళల బాధల గురించి ఆయన పట్టించుకోరన్నారు.
రాహుల్ గాంధీ గురువారం విడుదల చేసిన వీడియో సందేశంలో, ‘‘మణిపూర్‌లో ఏం జరుగుతోందో మీరందరూ చూశారు. ఓ రాష్ట్రం తగులబడుతూ ఉంటే, దేశ ప్రధాన మంత్రి ఏదైనా చెబుతారని మీరు భావించి ఉంటారు. ప్రధాని కనీసం ఇంఫాల్ వెళ్లి, ప్రజలతో మాట్లాడతారని మీరు అనుకొని ఉంటారు. మణిపూర్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి ఎందుకు వెళ్లడం లేదో, ఎందుకు మాట్లాడటం లేదో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ కేవలం కొందరికి మాత్రమే, ఆరెస్సెస్‌కు మాత్రమే ప్రధాన మంత్రి. మణిపూర్ గురించి ఆయనకు పట్టదు. ఆయన భావజాలమే మణిపూర్‌ను తగులబెడుతోందని ఆయనకు తెలుసు’’ అని ఆరోపించారు.
బీజేపీకి కేవలం అధికారం పట్ల మాత్రమే ఆసక్తి ఉంటుందని, దానిని సాధించేందుకు ఏమైనా చేస్తుందని దుయ్యబట్టారు. ‘‘అధికారం కోసం వాళ్లు మణిపూర్‌ను తగులబెడతారు, యావత్తు దేశాన్నీ తగులబెడతారు. దేశం బాధలు, విచారాల గురించి వాళ్లు పట్టించుకోరు’’ అని మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ సమస్యపై మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాలకు నోటీసులను వేర్వేరుగా లోక్‌సభలో సమర్పించాయి. కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును లోక్ సభ సభాపతి ఓం బిర్లా అనుమతించారు. అన్ని పార్టీలతో చర్చించి, అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీని, సమయాన్ని నిర్ణయిస్తానని తెలిపారు.
మణిపూర్‌లో మళ్లీ హింస ప్రారంభం
మణిపూర్‌లో మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం బిష్ణుపూర్ సమీపంలోని మొయిరంగ్‌లో రెండు వర్గాల మధ్య తుపాకులతో ఘర్షణ జరిగింది. కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ గ్రామంలో చాలా ఇళ్లను తగులబెట్టారని తెలిపారు. ఘర్షణ జరిగిన చోటుకు సమీపంలోని గ్రామస్థులు హుటాహుటిన వేరొక చోటుకు పరుగులు తీసి, ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
No-confidence motion : నలుపు రంగు దుస్తులతో పార్లమెంటుకు ఇండియా కూటమి ఎంపీలు
I.N.D.I.A : మణిపూర్ సందర్శనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి