Haryana : మత ఘర్షణలు మా వరకు వస్తాయనుకోలేదు : గురుగ్రామ్‌వాసులు
ABN , First Publish Date - 2023-08-02T14:45:23+05:30 IST
హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం ప్రారంభమైన మత ఘర్షణలు సమీపంలోని గురుగ్రామ్‌ను కూడా వణికిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు తమకు ఎదురవుతాయని గురుగ్రామ్ ప్రజలు ఊహించలేదు. రోడ్లపై ఘర్షణలు జరుగుతూ ఉంటే తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. అపార్ట్‌మెంట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం ప్రారంభమైన మత ఘర్షణలు సమీపంలోని గురుగ్రామ్‌ను కూడా వణికిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు తమకు ఎదురవుతాయని గురుగ్రామ్ ప్రజలు ఊహించలేదు. రోడ్లపై ఘర్షణలు జరుగుతూ ఉంటే తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. అపార్ట్‌మెంట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. జిల్లాలోని దేవాలయాలన్నిటినీ సందర్శిస్తూ జరిగే జలాభిషేక యాత్రపై దుండగులు దాడి చేయడంతో గృహ దహనాలు, రాళ్లు రువ్వడం వంటి దారుణాలు జరిగాయి. గో రక్షకుడు మోను మానేసర్ ఈ యాత్రలో పాల్గొంటారని వదంతులు రావడంతో ఈ ఘర్షణలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే తాను ఈ యాత్రలో పాల్గొనలేదని మోను వెల్లడించారు.
గురుగ్రామ్‌లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నాయకులు మాట్లాడుతూ, తాము తమ సొసైటీల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసుకున్నామని చెప్పారు. అయితే మార్కెట్లు మూసివేయడం వల్ల నిత్యావసర వస్తువుల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సోమవారం నుంచి వాటర్ ట్యాంకర్లు రాకపోవడం వల్ల నీటికి చాలా ఇబ్బందిగా ఉందన్నారు. మత ఘర్షణల వల్ల చాలా మంది ట్యాంకర్ డ్రైవర్లు ఈ పట్టణం నుంచి వెళ్లిపోయారని చెప్పారు.
మత ఘర్షణల కారణంగా కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. సోహ్నా, మానేసర్, పటౌడీ, ఫరూఖ్ నగర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేయడంతో ఆన్‌లైన్ తరగతులు జరగలేదు. అదేవిధంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇబ్బంది తలెత్తింది. సోహ్నా చౌక్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి అల్లరి మూకలు రెచ్చిపోయి ఇళ్లపైనా, వాహనాలపైనా రాళ్లు రువ్వారు. దారిలో కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టారు. మంగళవారం కూడా ఈ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. బాద్షాపూర్, సెక్టర్ 67లో దుకాణాలను తగులబెట్టారు. సెక్టర్ 70ఏలో ఓ దుకాణాన్ని తగులబెట్టారు.
ఓ బహుళ జాతి కంపెనీ కోసం ఇంటి వద్ద నుంచి పని చేస్తున్న మోహిత్ మాట్లాడుతూ, ఇంటర్నెట్ సేవలు లేకపోవడం వల్ల తాను అనుకోకుండా సెలవు తీసుకోవలసి వచ్చిందన్నారు. తమ కంపెనీ క్లయింట్లలో అత్యధికులు విదేశీయులేనని తెలిపారు. మత ఘర్షణల వల్ల ఇంటర్నెట్ సేవలు లేవని, తాము పని చేయలేమని విదేశాల్లో ఉన్న క్లయింట్లకు ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. సోహ్నా పరిసరాల్లో నివసిస్తున్న తమ కంపెనీ ఉద్యోగులు కార్యాలయానికి రాలేకపోయారని చెప్పారు.
రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేశ్ మాట్లాడుతూ, తన జీవితంలో ఇలాంటి సంఘటనలు గురుగ్రామ్ పట్టణంలో చూడలేదన్నారు. గురుగ్రామ్ వంటి పట్టణంలో మత ఘర్షణలను చూస్తానని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు.
ఇవి కూడా చదవండి :
Haryana and Delhi : హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీలో గస్తీ ముమ్మరం..
YCP Vs Congress : ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చిదంబరం ఆగ్రహం