Ayodhya Ramalayam : అయోధ్య రామాలయం నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ABN , First Publish Date - 2023-02-02T14:46:55+05:30 IST
రామ జన్మభూమిలో రామాలయం నిర్మాణంలో మరో కీలక పరిణామం బుధవారం జరిగింది. శ్రీరాముడు, జానకి మాత మూర్తులను
అయోధ్య : రామ జన్మభూమిలో రామాలయం నిర్మాణంలో మరో కీలక పరిణామం బుధవారం జరిగింది. శ్రీరాముడు, జానకి మాత మూర్తులను తయారు చేయడం కోసం నేపాల్ (Nepal) నుంచి సాలగ్రామ శిలలను రప్పించారు. సాలగ్రామాలను సాక్షాత్తు విష్ణుమూర్తిగా ఆరాధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సాలగ్రామాల రవాణా కార్యక్రమం జనవరి 28న నేపాల్‌లో ప్రారంభమైంది, ఇవి బుధవారం అయోధ్యకు చేరుకున్నాయి.
సీతా మాత (Sita Mata) జన్మస్థలం జనక్‌పూర్ అనే విషయం తెలిసిందే. ఈ సాలగ్రామాలను మొదట నేపాల్‌లోని కాళీ గండకి, గాలేశ్వర్ నుంచి ఆ దేశంలోని జనక్‌పుర్‌ధామ్‌లో ఉన్న జానకి మాత (Janaki Mata) దేవాలయానికి తీసుకెళ్ళారు. ఈ శిలలు మ్యగ్డి, ముస్టాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కాళీ గండకి నది పరీవాహక ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. వీటిని అయోధ్యకు తరలించేందుకు జానకి దేవాలయం అధికారులతో కలిసి నేపాలీ కాంగ్రెస్ నేత, మాజీ ఉప ప్రధాన మంత్రి బిమలేంద్ర నిధి సహకరించారు. ఆయన స్వస్థలం కూడా జనక్‌పూర్.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ (Champat Rai) మాట్లాడుతూ, శ్రీరాముని మూర్తులను తయారు చేసేందుకు సాలగ్రామాలు అనేక నగరాల గుండా అయోధ్యకు చేరుకున్నాయన్నారు. శ్రీరామ జన్మభూమిలో రామాలయం నిర్మాణం బాధ్యతలను ఈ ట్రస్ట్ నిర్వహిస్తోందనే విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 2020 ఆగస్టు 5న రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరునాటికి రామాలయం నిర్మాణం పూర్తవుతుందని, వచ్చే ఏడాది జనవరి నుంచి భక్తుల పూజలకు సిద్ధమవుతుందని ఈ ట్రస్ట్ చెప్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కూడా వచ్చే జనవరి నుంచి రామాలయం భక్తుల పూజలకు సిద్ధమవుతుందని చెప్పారు.