Chhatrapati Shivaji : కెమెరా ఆన్‌లో ఉన్నా పట్టించుకోని శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ... కేంద్ర మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు...
ABN , First Publish Date - 2023-01-08T12:50:13+05:30 IST
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆదివారం కేంద్ర మంత్రులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ముంబై : ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆదివారం కేంద్ర మంత్రులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ (Chhatrapati Shivaji Maharaj)పై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ (Bhagat Singh Koshyari) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దీనిపై స్పందించడంలో కేంద్ర మంత్రులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఛత్రపతి శివాజీని అవమానించినప్పటికీ, ఆ విషయంపై తప్ప మిగిలిన అన్ని విషయాలపైనా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు స్పందిస్తారని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఛత్రపతిని అవమానించిన విషయాన్ని అందరూ గమనించారని, అయితే బీజేపీ నేతలకు శివాజీ అంటే ఎప్పుడూ ప్రేమ లేదని చెప్పారు. కొన్నేళ్ళ క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఛత్రపతి శివాజీ మహరాజ్ (Chhatrapati Shivaji Maharaj)తో పోల్చుతూ హోర్డింగ్స్ పెట్టారని గుర్తు చేశారు.
శివాజీపై ప్రేమ నిజమే అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde), ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) రాజ్ భవన్ తలుపు తట్టి, శివాజీ మహరాజ్‌కు జరిగిన అవమానంపై సమాధానం చెప్పాలని గవర్నర్‌ను నిలదీసి ఉండేవారని చెప్పారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ వెళ్లి, అమిత్ షా (Amit Shah)ను కలిసి, తక్షణమే కొషియారీని గవర్నర్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసి ఉండేదన్నారు. కానీ అలా జరగలేదన్నారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీ (Bhagat Singh Koshyari) గత నవంబరులో మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహరాజ్ పాత కాలంనాటి ఆదర్శ పురుషుడని, బాబా సాహెబ్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేటి తరం ఆదర్శ పురుషులని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్‌సీపీ, శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం, మహారాష్ట్రలోని కాంగ్రెస్ నేతలు గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు.