Opposition meet : ప్రతిపక్షాల సమావేశాలు.. సోనియా గాంధీ సంచలన నిర్ణయం..
ABN , First Publish Date - 2023-07-12T11:36:47+05:30 IST
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యతను సోనియా గాంధీ స్వీకరించారు. ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి ఆమె హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యతను సోనియా గాంధీ (Sonia Gandhi) స్వీకరించారు. ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి ఆమె హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో 24 పార్టీలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీల నేతలకు సోనియా విందు ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ఇదిలావుండగా, ఈ సమావేశాలకు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఆహ్వానం పంపించారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ వైఖరి ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకున్నట్లుగా లేదు. దీంతో ఢిల్లీ ఆర్డినెన్స్‌కు కాంగ్రెస్ బహిరంగ మద్దతు ప్రకటించే వరకు భవిష్యత్తులో తాము ఇటువంటి సమావేశాల్లో పాలుపంచుకోవడం కష్టమవుతుందని ఆ పార్టీ తెలిపింది. మరోవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఎన్డీయేయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన నేతృత్వంలో గత నెల 23న పాట్నాలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మమత బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద 17 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కొనాలని ఈ పార్టీలన్ని నిర్ణయించాయి. ఉమ్మడి ఎజెండాతో, రాష్ట్రాలవారీ వ్యూహాలతో బీజేపీని ఎదుర్కొంటామని తెలిపాయి. తమ మధ్య విభేదాలను పక్కనబెట్టి, ఇచ్చి, పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని తెలిపాయి.
ప్రతిపక్షాల ఐక్యత కోసం నిర్వహిస్తున్న రెండో సమావేశం బెంగళూరులో జరగబోతోంది. ఈ సమావేశాలకు కొత్తగా ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. వీటిలో కేడీఎంకే, ఎండీఎంకే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మిత్ర పక్షాలుగా ఉండేవి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ కూడా ఇటీవల ఈ విషయాన్ని చెప్పారు.
24 రాజకీయ పార్టీల మధ్య విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయం రావడం కోసం ఈ సమావేశాల్లో ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశాలు జూలై 13న జరగవలసి ఉంది, కానీ ఎన్‌సీపీలో చీలిక రావడంతో జూలై 17కు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి
Collegium system : కొలీజియం వ్యవస్థపై సీజేఐ చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు
Air India : ఏయిరిండియా విమానంలో నేపాల్ జాతీయుడి అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు..