Mallikharjuna Kharge fires on BJP: నియంతృత్వ పాలకులను తరిమికొట్టాలి: మల్లికార్జున ఖర్గే
ABN , First Publish Date - 2023-09-17T14:40:26+05:30 IST
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతృత్వంగా పాలిస్తున్న బీజేపీ(BJP)ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjuna Kharge) అన్నారు.
హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతృత్వంగా పాలిస్తున్న బీజేపీ(BJP)ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjuna Kharge) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సిద్ధాంతాలు పక్కన పెట్టి, పార్టీలకతీతంగా కలిసి రావాలని కోరారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం రెండో రోజు ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ లోని అన్ని స్థాయిల నేతలు కలిసి కట్టుగా పోరాటి రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS), దేశంలో బీజేపీలను ఇళ్లకు సాగనంపాలని అన్నారు. రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "ప్రస్తుతం మనం విశ్రాంతి తీసుకోవడానికి సరైన సమయం కాదు. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక రెట్లు పెరిగాయి.
పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత సమస్యల పరిష్కారానికి ప్రధాని మోదీ ముందుకు రావట్లేదు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా(INDIA Alliance) కూటమి ప్రేక్షక పాత్ర పోషించబోదని, నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. మీడియా ముందు మాట్లాడేటప్పుడు పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా మాట్లాడాలని నేతలకు సూచించారు. 'వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి అవిశ్రాంతంగా పని చేయాలి. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఐక్యత, క్రమశిక్షణ ద్వారానే ప్రత్యర్థులను ఓడించగలం. ఐక్యంగా ఉండి కర్ణాటక(Karnataka)లో సాధించిన విజయం మన కళ్ల ముందు ఉన్నదే. అక్కడ సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలిసి కట్టుగా పోరాడి అఖండ విజయం సాధించారు' అని ఖర్గే అన్నారు.