KCR Vs Tamilisai: సుప్రీంకోర్టులో ఇవాళ ఏం జరిగిందంటే?
ABN , First Publish Date - 2023-03-27T19:24:29+05:30 IST
తమిళిసై సౌందరరాజన్‌పై తెలంగాణ సర్కార్ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ (Governor of Telangana) తమిళిసై సౌందరరాజన్‌పై (Tamilisai Soundararajan) తెలంగాణ సర్కార్(Telangana Govt) వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యమైన బిల్లులను ఆమోదించడం లేదని గవర్నర్కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం సమయం కోరింది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు పిటిషన్పై విచారణను ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ డి.వై.చంద్రచూడ్(Dhananjaya Y. Chandrachud) వాయిదా వేశారు.
అంతకు ముందు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మార్చి మొదటివారంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ పది బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, గత ఏడాది సెప్టెంబరు నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలి బడ్జెట్ సమావేశాల తర్వాత పంపించిన మూడు బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదం తెలపలేదని పిటిషన్లో పేర్కొంది. తన పిటిషన్లో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శిని చేర్చింది. శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని, అందుకే ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్టు తన న్యాయ పరిధిని ఉపయోగించాలంటూ న్యాయస్థానం తలుపు తట్టక తప్పలేదని పేర్కొంది.
ఆమోదం తెలపకుండా బిల్లులను వాయిదా వేస్తే హక్కు, ఆలస్యం చేసే హక్కు గవర్నర్‌కు లేదని వివరించింది. గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని, రాజ్యాంగంలోని అధికరణ 163 కింద ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకే విధులను నిర్వహించాలని, శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. పునః పరిశీలించాలంటూ బిల్లును గవర్నర్ తిప్పి పంపవచ్చని, కానీ, సవరణ చేసి కానీ చేయకుండా కానీ దానిని తిరిగి అసెంబ్లీ ఆమోదిస్తే ఆ బిల్లును తొక్కిపట్టే అధికారం గవర్నర్‌కు లేదని అధికరణ 200 స్పష్టం చేస్తోందని వివరించింది. ఈ విషయంలో టీటీ కృష్ణమాచారి చేసిన వాదనలను ఉటంకించింది. బిల్లులను ఆమోదించడం రాజ్యాంగబద్ధ విధి అని; రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ వాటిపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా తొక్కిపెట్టడాన్ని అసాధారణం, అక్రమం, రాజ్యాంగ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రకటించాలని సుప్రీం కోర్టును కోరింది. అలాగే, పెండింగులో ఉన్న బిల్లులకు ఆమోదం తెలపాల్సిందిగా గవర్నర్‌ను ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తన పిటిషన్‌తోపాటు మొత్తం పది బిల్లుల గెజిట్‌లనూ జత చేసింది.
రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. కొద్ది నెలలుగా ఇరు వ్యవస్థల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు అనుమతి ఇవ్వని గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, హైకోర్టు సూచనతో బయటే సర్దుబాటు చేసుకోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. గవర్నర్ కూడా సమావేశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దాంతో, ఇరు వ్యవస్థల మధ్య పంచాయితీ సమసిపోయిందని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ, ఆ తర్వాత కూడా బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీనికితోడు, ప్రొటోకాల్ వివాదం కూడా కొనసాగుతోంది. ఇటీవల నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో పాల్గొనడానికి గవర్నర్ వెళితే, అక్కడి కలెక్టర్, సీపీ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
తాము ఎన్నో రకాల ఉద్దేశాలు, లక్ష్యాలతో బిల్లులను ఆమోదించి పంపితే గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, బిల్లుల్లో స్పష్టత కొరవడిందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం లేదని, అందుకే పెండింగ్‌లో పెట్టాల్సి వస్తోందని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. గత సెప్టెంబరులో జరిగిన శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదించి, అదే నెల 13న గవర్నర్ తమిళిసైకి పంపించింది. వాటిలో జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించారు. మిగతా ఏడింటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందులో ప్రధానంగా ఆజామాబాద్ పారిశ్రామికవాడలోని లీజుదారులకు హక్కులు కల్పించే బిల్లును ఆమోదిస్తే.. ప్రభుత్వానికి దాదాపు రూ.2000 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ బిల్లును ఆమోదించడానికి గవర్నర్ విముఖంగా ఉన్నారని సమాచారం. అందుకే, దానిని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినట్లు తెలుస్తోంది. ఇక, యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ కోసం కామన్ బోర్డును ఏర్పాటు చేస్తూ రూపొందించిన బిల్లును కూడా ఆమోదించకపోవడంతో 1062 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయలేకపోతున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ బిల్లు ద్వారా గవర్నర్ పాత్ర లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజ్‌భవన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్సిటీలు స్వయంప్రతిపత్తి సంస్థలని, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను స్వయంగా చేపడుతుంటాయని, యూజీసీ నిబంధనల మేరకు చేపట్టే ఈ నియామకాలపై వర్సిటీల చాన్స్‌లర్‌గా గవర్నర్ అజమాయిషీ ఉంటుందని, కానీ, కామన్ బోర్డు ఏర్పాటుతో గవర్నర్‌కు ఎటువంటి అజమాయిషీ ఉండదని రాజ్‌భవన్ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ బిల్లుపై వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ ఆదేశించడంతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి వివరణ ఇచ్చారు కూడా. అలాగే, వైద్య విద్యా సంచాలకుడు, అదనపు సంచాలకుల పదవీ విరమణ వయసును 61 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ సవరణ బిల్లుపైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి వివరణ ఇచ్చి వచ్చారు. అయినా.. వాటిని గవర్నర్ ఆమోదించలేదు. హరితహారం లక్ష్య సాధనకు అడవుల పెంపకానికి సంబంధించి కొత్త కోర్సులను ప్రవేశపెట్టాల్సి ఉందని, అందుకే అటవీ వర్సిటీని ఏర్పాటు చేస్తూ బిల్లును పంపామని, దానిని కూడా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారని తప్పుబడుతున్నాయి.
మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరోధించడానికి తీసుకొచ్చిన సవరణ బిల్లును కూడా ఆమోదించడం లేదని, దానిని ఆమోదిస్తే.. అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదని చెబుతున్నాయి. అలాగే, కాలానుగుణంగా వాహన పన్నులను మార్చుకునే బిల్లును; పలు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి మంజూరు చేస్తూ తెచ్చిన బిల్లును; వ్యవసాయ వర్సిటీలో అఫిలియేషన్, రికగ్నిషన్‌కు సంబంధించిన బిల్లును పెండింగ్‌లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులను గవర్నర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఆమోదించాలి. కానీ.. వాటిని ఎప్పటిలోగా ఆమోదించాలన్న నిర్దిష్ట గడువు రాజ్యాంగంలో లేదు. ఆ అధికరణలో ‘యాజ్ సూన్ యాజ్ పాసిబుల్’ అన్న వాక్యం ఉండడంతో సుదీర్ఘకాలంపాటు రాజ్‌భవన్‌లో బిల్లులు పెండింగ్ పడిపోతున్నాయి. ఈ అధికరణను సవరించాలంటూ బీఆర్‌ఎస్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కొన్ని బిల్లులు ఇవే!
ది అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) (అమెండ్‌మెంట్) బిల్-2022: అజామాబాద్ పారిశ్రామిక ప్రాంతం చుట్టూ ఇళ్లు నిర్మించారు. కొంతమంది లీజుదారులు ఇతర వ్యాపారాలకు వెళ్లిపోయారు. కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. దాంతో, లీజుదారులకే హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న యూనిట్ల యజమానులను ఒరిజనల్ అలాటీలుగా, సబ్ లీజులో ఉన్నవారిని ఇతరులుగా భావించి హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఒరిజనల్ అలాటీల నుంచి 100 శాతం మార్కెట్ విలువను, ఇతరుల (సబ్ లీజుదారులు) నుంచి 200 శాతం వసూలు చేసి, వారికి హక్కులు కల్పించాలన్నది చట్ట సవరణ ఉద్దేశం. తద్వారా సర్కారుకు భారీగా ఆదాయం రానుంది.
తెలంగాణ మున్సిపల్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్- 2022: ఇందులో చాలా అంశాలను పొందుపరిచినా.. ప్రధానమైనది మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడిగించడం. ఇది ఆమోదం పొందకపోవడంతో ఇప్పటికే చాలా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించారు. కొందరు హైకోర్టుకు కూడా వెళ్లారు.
తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్)(అమెండ్‌మెంట్) బిల్- 2022: ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ఇదివరకు 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. కానీ.. వాటికంటే ఉన్నత స్థాయి పోస్టులైన డీఎంఈ, అదనపు డీఎంఈ పోస్టులకు పెంచలేదు. ఈ బిల్లులో వాటిని కూడా చేర్చారు.
తెలంగాణ మున్సిపాలిటీస్ (అమెండ్‌మెంట్) బిల్- 2023: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని మునిసిపాలిటీగా మారుస్తూ చేసిన చట్టమిది. అలాగే, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో గల బోయలపల్లి (నర్సింగరావు పల్లి), తాళ్ల నర్సింహాపురం గ్రామాలను ఆ మున్సిపాలిటీ నుంచి విడదీస్తూ సవరణ తీసుకొచ్చారు.
తెలంగాణ పంచాయతీరాజ్ (అమెండ్‌మెంట్) బిల్- 2023: కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసే బిల్లు ఇది. భద్రాచలం పంచాయతీని భద్రాచలం, సీతారామ్‌నగర్, శాంతినగర్ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ.. ఆసిఫాబాద్ పంచాయతీ నుంచి రాజంపేట్‌ను విడదీస్తూ తీసుకొచ్చిన బిల్లు ఇది.