Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

ABN , First Publish Date - 2023-07-14T15:30:07+05:30 IST

మహారాష్ట్ర శాసన సభ సభాపతికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసును జారీ చేసింది.

Shiv Sena MLAs : శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు..

న్యూఢిల్లీ : మహారాష్ట్ర శాసన సభ సభాపతికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసును జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde), ఆయన వర్గంలోని శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను అవిభాజ్య శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు కోరిన సంగతి తెలిసిందే.

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షిండే సహా 39 మంది ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని సునీల్ ప్రభు వేర్వేరుగా పిటిషన్లను శాసన సభ సభాపతికి సమర్పించారు. దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవడంలో సభాపతి రాహుల్ నార్వేకర్ తాత్సారం చేస్తున్నారని, నిర్ణీత సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని సునీల్ ప్రభు సుప్రీంకోర్టును కోరారు. ప్రభు తరపున సీనియర్ అడ్వకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ, సమంజసమైన సమయంలో ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం మే 11న రాహుల్ నార్వేకర్‌ను ఆదేశించినప్పటికీ, ఆయన చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టుకు తెలిపారు.

దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం స్పందిస్తూ, తాము శాసన సభ సభాపతికి నోటీసు జారీ చేస్తామని, స్పందించేందుకు రెండు వారాల గడువు ఇస్తామని తెలిపింది.

మే 11న రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని, ఆ తర్వాత తాను మూడుసార్లు నార్వేకర్‌కు లేఖలు రాశానని ప్రభు చెప్పారు. అనర్హత పిటిషన్లపై సమంజసమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కనీసం ఒకసారి అయినా సభాపతి విచారణ జరపలేదన్నారు. స్పీకర్ తన రాజ్యాంగబద్ధ కర్తవ్యాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని జాప్యం చేస్తూ, షిండే చట్టవిరుద్ధంగా కొనసాగడానికి అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు.

షిండే, మరో 15 మంది ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ అవిభాజ్య శివసేన తరపున ప్రభు 2022 జూన్ 23న పిటిషన్లను దాఖలు చేశారు. వీరికి గత ఏడాది నోటీసులు జారీ అయినప్పటికీ, వారు తమ సమాధానాలను ఇప్పటికీ సమర్పించలేదు. ప్రభు గత ఏడాది జూన్ 25న ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు, 22 మంది శివసేన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశారు. షిండే సహా 39 మంది ఎమ్మెల్యేలు శివసేన పార్టీ విప్‌ను ధిక్కరించారని, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూలై 3న, జూలై 5న వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి :

Modi France Visit : ఫ్రాన్స్‌లో భారతీయ కరెన్సీలో యూపీఐ చెల్లింపులు.. పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు.. : మోదీ

Kosovo Parliament : కొసావో పార్లమెంటులో కొట్లాట.. పిడిగుద్దులతో తలపడిన ఆడ, మగ సభ్యులు..

Updated Date - 2023-07-14T15:30:07+05:30 IST