Rs 2000 Note: 2000 రూపాయల నోటు మార్పిడిపై కీలక పరిణామం.. బంతి సుప్రీం కోర్టులో..!
ABN , First Publish Date - 2023-06-01T12:25:08+05:30 IST
భారతీయ రిజర్వు బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ రూ.2,000 నోట్ల మార్పిడికి అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో అపీలు దాఖలు చేసే
న్యూఢిల్లీ : భారతీయ రిజర్వు బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ రూ.2,000 నోట్ల మార్పిడికి అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో అపీలు దాఖలు చేసే ప్రయత్నం జరిగింది. ఎటువంటి గుర్తింపు పత్రాల అవసరం లేకుండానే ఈ నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మే 29న తోసిపుచ్చింది. దీనిపై పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానంలో అపీలు చేశారు. మూడు రోజుల్లోనే రూ.50,000 కోట్ల విలువైన నోట్లను మార్చుకున్నారని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ ఈ అపీలుపై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ (Ashwini Upadhyay) సుప్రీంకోర్టు (Supreme Court)లో ఈ అపీలును దాఖలు చేసేందుకు ప్రయత్నించారు. ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2000 నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రగ్ మాఫియాలు, హంతకులు తమ వద్దనున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటారని ఆరోపించారు. ఈ నోట్ల మార్పిడి లేదా జమ చేసేటపుడు బ్యాంకులు రిక్విజిషన్ స్లిప్ వంటివాటిని అడగటం లేదన్నారు. మూడు రోజుల్లో రూ.50 వేల కోట్ల రూపాయల విలువైన రూ.2000 నోట్లను మార్చేశారన్నారు. ఇలా జరగడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని చెప్పారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా మాట్లాడుతూ, ఇలాంటి పిటిషన్లను సమ్మర్ వెకేషన్ సమయంలో తాము అనుమతించబోమన్నారు. వేసవి సెలవుల తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వద్ద మెన్షన్ చేయాలని తెలిపారు. పిటిషనర్ స్పందిస్తూ, అప్పటికి నల్లధనమంతా తెల్లధనంగా మారిపోతుందన్నారు. అయినప్పటికీ ఈ అపీలుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ ధర్మాసనంలో జస్టిస్ కేవీ విశ్వనాథన్ కూడా ఉన్నారు.
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించింది. సెప్టెంబరు 30నాటికి ఈ నోట్లను మార్చుకోవచ్చునని, లేదా, బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చునని చెప్పింది. మే 19న ఆర్బీఐ, మే 20న ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం రూ.2000 నోట్లను రిక్విజిషన్ స్లిప్స్ లేదా ఆధార్ కార్డు వంటివేవీ లేకుండానే మార్చుకోవచ్చు. ఇటువంటి నిబంధనల వల్ల చట్టవిరుద్ధ, అక్రమ సొమ్మును చట్టబద్ధమైన సొమ్ముగా మార్చుకుంటారని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఆరోపించారు. అవినీతి నిరోధక చట్టం లక్ష్యాలకు విరుద్ధంగా ఈ మార్పిడి జరుగుతుందన్నారు. నిష్కళంక, పారదర్శక పాలన లేనిదే భారత దేశం అభివృద్ధి చెందదని చెప్పారు. దీని కోసం అవినీతి రహిత సమాజం ప్రాథమిక అవసరమని తెలిపారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం జీవించే హక్కుకు హామీ ఉందన్నారు. రాజ్యాంగ ప్రవేశిక సువర్ణ లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. నల్లధనం ఉత్పత్తి, బినామీ లావాదేవీలు, ఆదాయానికి మించిన ఆస్తులు వంటివాటిని నిర్మూలించకపోతే జీవించే హక్కు ఆచరణలో అమలు కాదని తెలిపారు. కాబట్టి బ్లాక్ మనీ హోల్డర్స్‌ను గుర్తించవలసిన బాధ్యత ఆర్బీఐకి ఉందన్నారు. వారు తమ నల్లధనాన్ని చట్టబద్ధమైన ధనంగా మార్చుకునే అవకాశాలను కల్పించవద్దని కోరారు. ఆర్బీఐ, ఎస్‌బీఐ నోటిఫికేషన్లను మదింపు చేయడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైందన్నారు.
ఇవి కూడా చదవండి :
Chanchalguda Jail: చంచల్‌గూడ గేట్.. తాడేపల్లిలో రిమోట్
Gujarat : సముద్రంలో మునిగిపోతున్న ముగ్గుర్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే