CM Jagan: వసంతకు సీఎం జగన్ బుజ్జగింపు వెనుక కారణం ఇదేనా?
ABN , First Publish Date - 2023-02-10T17:25:08+05:30 IST
కోటంరెడ్డి ఎపిసోడ్‌తో జగన్ ఉలిక్కిపడ్డారా...? ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు జగన్‌ను కలవరపెడుతున్నాయా...? వసంత కృష్ణ ప్రసాద్ కూడా వెళ్లిపోతారనే తాడేపల్లికి పిలిపించారా? నిజంగానే జోగి రమేష్‌కు జగన్ క్లాస్ పీకి వసంతకు అభయం ఇచ్చారా..
కోటంరెడ్డి ఎపిసోడ్‌తో జగన్ ఉలిక్కిపడ్డారా...? ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు జగన్‌ను కలవరపెడుతున్నాయా...? వసంత కృష్ణ ప్రసాద్ కూడా వెళ్లిపోతారనే తాడేపల్లికి పిలిపించారా? నిజంగానే జోగి రమేష్‌కు జగన్ క్లాస్ పీకి వసంతకు అభయం ఇచ్చారా...? ఏపీ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్న సందేహాలివీ. ఇందుకు కారణమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం..
వైసీపీలో (YCP) ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జగన్‌కు (CM Jagan) అత్యంత ఆప్తుడిగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA Kotam Reddy) కూడా జగన్ అండ్ కో చేస్తున్న అరాచకాలతో వైసీపీని వీడారు. ఓపెన్‌గానే విమర్శలు చేశారు. ఇక పార్టీకి చాలాకాలంగా అంటీముట్టనట్టుగా ఉంటున్న మైలవరం (Mylavaram) ఎమ్మెల్యే కూడా పార్టీని వీడుతారనే చర్చలు సీఎం జగన్‌ను కలవరపెట్టాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ఇంకా ఒత్తిడి పెరుగుతుందని, ఆనం, కోటంరెడ్డి బాటలోనే మిగతా ఎమ్మెల్యేలు కూడా పయనిస్తే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన సీఎం జగన్... వసంత కృష్ణ ప్రసాద్‌ను పిలిపించుకొని మాట్లాడినట్లు తెలుస్తోంది.
టీడీపీలో (TDP) కీలక నేత అయిన దేవినేని ఉమను (Devineni Uma) ఓడించి సత్తా చాటిన వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna prasad) కూడా కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తన మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) జోక్యం చేసుకోవటం, తనే పెత్తనం చేయటంపై వసంత కృష్ణ ప్రసాద్ ఓపెన్‌గానే ఫైర్ అయ్యారు. నిజానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహరం కన్నా ముందే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్తారని అంతా భావించారు. ప్రభుత్వం ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలపై పెడుతున్న కేసులను ఆయన ఓపెన్‌గానే తప్పుబట్టారు. ఈ విధంగా మైలవరం పంచాయతీ ఎన్నో రోజులుగా నడుస్తున్నా... ఇప్పుడే ఎందుకు పిలిచారో అర్థం చేసుకోవాలని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. పైగా మంత్రి జోగి రమేష్‌కు జగన్ క్లాస్ పీకాడని వాళ్లే లీకులిచ్చారంటే కోటంరెడ్డి ఎపిసోడ్ మానసికంగా వైసీపీని ఎంత ఆందోళనకు గురిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా తాను పార్టీ వీడనని చెప్పించటం కూడా అందులో భాగమేనంటున్నారు. కానీ ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి, ప్రజల్లో వైసీపీ అంటే పెరుగుతున్న ఆక్రోశాన్ని ఎక్కువ రోజులు తాడేపల్లి ప్యాలెస్ నుండి మ్యానేజ్ చేయలేరని, రాబోయే రోజుల్లో జగన్ పాలనను పక్కనపెట్టి వైసీపీ గ్రూప్ రాజకీయాలను సరిచేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతాయని జోస్యం చెప్తున్నారు.