AIADMK : ఏఐఏడీఎంకే చీఫ్ వివాదం... సుప్రీంకోర్టులో పన్నీర్‌సెల్వంకు షాక్...
ABN , First Publish Date - 2023-02-23T13:39:28+05:30 IST
ఏఐఏడీఎంకే (AIADMK) తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి కే పళని స్వామి (Edappadi K Palaniswami) కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఏఐఏడీఎంకే (AIADMK) తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి కే పళని స్వామి (Edappadi K Palaniswami) కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం తీర్పు చెప్పింది. గతంలో మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత ఓ పన్నీర్‌సెల్వం (O Panneerselvam)కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మధ్య వివాదంపై ఈ తీర్పు ప్రభావం ఉండబోదని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పళనిస్వామి వర్గీయులు చెన్నైలో వీథుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
హైకోర్టు 2022 సెప్టెంబరు 2న ఇచ్చిన తీర్పును తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. అయితే పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య వివాదాన్ని పరిశీలించలేదని తెలిపింది.
2022 జూలై 11న జరిగిన ఏఐఏడీఎంకే కార్యనిర్వాహక మండలి సమావేశంలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని నియమించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. వీటి గురించి వాదనలను పరిశీలించలేదని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది.
ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలిత (J Jayalalithaa) 2016 డిసెంబరులో దివంగతులయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీలో నేతల మధ్య వివాదాలు తీవ్రమయ్యాయి. ఆమె మొదట తన వారసునిగా ఓ పన్నీర్‌సెల్వంను ఎంపిక చేశారు. ఆమె ఆశీస్సులతోనే పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డీ జయకుమార్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు చారిత్రకమైనదని పేర్కొన్నారు. పాండవులు, కౌరవుల మధ్య యుద్ధంలో పాండవులే గెలిచారన్నారు. పన్నీర్‌సెల్వం రాజకీయ భవిష్యత్తు శూన్యమని అర్థం వచ్చే విధంగా చేతులతో సైగలు చేశారు.
ఇవి కూడా చదవండి :
Delhi Liquor Policy Case : కేజ్రీవాల్‌కు ఈడీ భారీ షాక్
Congress : కాంగ్రెస్‌కు భారీ షాక్... అత్యంత కీలక నేత రాజీనామా...