TMC Vs BJP: జాతీయ హోదాపై అమిత్‌షాకు మమత ఫోన్?

ABN , First Publish Date - 2023-04-19T21:01:32+05:30 IST

మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా గురించి మాట్లాడారని ప్రచారం జరుగుతోంది.

TMC Vs BJP: జాతీయ హోదాపై అమిత్‌షాకు మమత ఫోన్?
Mamata dialled Shah on partys national status tag TMC warns Suvendu

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (TMC supremo Mamata Banerjee) కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు (Amit Shah) ఫోన్ చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా గురించి మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. టీఎంసీ ఇటీవలే జాతీయ పార్టీ హోదా కోల్పోయినట్లు ఈసీ ప్రకటించిన నేపథ్యంలో హోదా పునరుద్ధరణ కోసం షాకు దీదీ ఫోన్ చేశారని జరుగుతున్న ప్రచారంపై తృణమూల్ మండిపడింది. పుకార్లు ప్రచారం చేస్తున్న పశ్చిమబెంగాల్ ప్రతిపక్షనేత సువేందు(Suvendu) అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించింది. అంతేకాదు తాను షాకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కూడా దీదీ కోల్‌కతాలో హెచ్చరించారు.

2024లో బీజేపీ అధికారంలోకి రాబోదని మమత జోస్యం చెప్పారు. బీజేపీకి రెండొందలకు మించి సీట్లు రాబోవన్నారు. అధికారంలో ఉన్నారని ఏది పడితే అది చేస్తామంటే కుదరదని బీజేపీకి దీదీ హితవు చెప్పారు. పదవి శాశ్వతం కాదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాత్రమే శాశ్వతమని ఆమె చెప్పారు. రాజ్యాంగ సవరణలు ఉండొచ్చని, అంత మాత్రం చేత రాజ్యాంగాన్నే కాలరాస్తామంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు.

2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచీ టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నాటి ఎన్నికల్లో బీజేపీ 18 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని టీఎంసీకి సవాలు విసిరింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పోరు పతాక స్థాయికి వెళ్లింది. టీఎంసీ మునుపటి కన్నా ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చినా బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచే ఎక్కువ మంది నాయకులను ఆకర్షించి రోజురోజుకూ బలపడుతున్న బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో మమతాబెనర్జీకి ప్రధాన సవాలుగా నిలవనుంది. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న కమలనాథులకు దీదీ చెక్ పెట్టగలరా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.

Updated Date - 2023-04-19T21:01:56+05:30 IST