Uddhav Thackeray: కేసీఆర్, మీరు ‘ఇండియా’కి మద్దతిస్తున్నారా లేక బీజేపీకా.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఉద్ధవ్ ఠాక్రే

ABN , First Publish Date - 2023-08-27T22:26:22+05:30 IST

శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్‌కు ఒక సూటి ప్రశ్న సంధించారు. కేసీఆర్ ‘ఇండియా’ కూటమికి మద్దతిస్తున్నారా? లేక బీజేపీకా? అనేది క్లారిటీ ఇవ్వాలని...

Uddhav Thackeray: కేసీఆర్, మీరు ‘ఇండియా’కి మద్దతిస్తున్నారా లేక బీజేపీకా.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఉద్ధవ్ ఠాక్రే

శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్‌కు ఒక సూటి ప్రశ్న సంధించారు. కేసీఆర్ ‘ఇండియా’ కూటమికి మద్దతిస్తున్నారా? లేక బీజేపీకా? అనేది క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని హింగోలీలో జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ‘ఇండియా’ కూటమికి మద్దతు ఇస్తున్నారా? లేక భారతీయ జనతా పార్టీకా? ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వాలి. మీరు దేశంతో ఉంటే.. ఇండియా కూటమిలో చేరండి. లేకపోతే బీజేపీతో కుమ్మక్కయ్యారన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించండి. మీరు ఓట్లను చీల్చొద్దు’’ అని ఠాక్రే చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. ఉద్ధవ్ ఠాక్రే ఈ సూటి ప్రశ్న కేసీఆర్‌కు సంధించారు. మరి.. ఇందుకు ఆయనెలా బదులిస్తారో చూడాలి.


ఇదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)ను అమీబాతో పోల్చుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఈ ఫ్రంట్‌కు ఖచ్చితమైన ఆకారం గానీ, పరిమాణం గానీ లేదని విమర్శించారు. గతంలో ఇండియా కూటమిని ప్రధాని మోదీ ‘ఘమండియా’గా (అహంకారం), ‘ఇండియన్ ముజాహిదీన్’గా పేర్కొన్నందుకు తాజాగా ఠాక్రే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్‌డీఏను ‘ఘమ-ఎన్‌డీఏ’ (ఘమండియే - అహంకారం)గా పిలవాలని అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే జాతీయవాద పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయని.. కానీ ఎన్డీఏలో దేశద్రోహులతో పాటు ఇతర పార్టీల్ని విచ్ఛిన్నం చేసిన వారు ఉన్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఇండియా కూటమి తప్పకుండా ఎన్డీఏని ఓడిస్తుందని ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి మోడీకి వ్యతిరేకంగా ఏర్పడలేదని, దేశం కోసమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమిలో చేరాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవిశ్రాంతంగా పనిచేసిన బీజేపీ క్యాడర్‌పై తనకు జాలేస్తుందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇన్నాళ్లూ తమది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని డబ్బా కొట్టుకున్నారని.. ఇప్పుడు దీనిని అజిత్ పవార్ ఇంజిన్ కూడా చేరిందని ఎద్దేవా చేశారు. అసలు ఇది గూడ్స్ రైలా? లేక ఇంకేమైనైనా? దీనికి ఇంకా ఎన్ని ఇంజిన్లు జోడించబడతాయి? అని దుయ్యబట్టారు. అలాగే.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘శాసన్ అప్లయ దారి’ (మీ ఇంటి వద్దే ప్రభుత్వం) కార్యక్రమంపై సైతం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదో పచ్చి అబద్ధం తప్ప మరొకటి కాదని తూర్పారపట్టారు. అకాలవర్షాల కారణంగా రైతులకు పంట నష్టం వాటిల్లిందని.. ఇప్పుడు వాళ్లు కరువుని ఎదుర్కుంటున్నారని అన్నారు. ఇలా రాష్ట్రం కరువులో ఉంటే.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జపాన్ వెళ్లారని.. కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్‌కి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు.

Updated Date - 2023-08-27T22:26:22+05:30 IST